పుత్తూరు : స్థానిక నగరం రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నూతన మద్యం దుకాణానికి బుధవారం స్థానికులు అడ్డుకున్నారు. కల్లుగీత కార్మికుల కోటా కింది షాపును దక్కించుకొన్న వారు ఆలయ సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని మద్యం దించుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన ఎకై ్సజ్ ఎస్‌ఐ శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలకు 100 మీటర్లకు అవతల మద్యం షాపు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయానికి, 30 పడకల ఆసుపత్రికి సైతం 100 మీటర్ల దూరాన్ని పాటించాలని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ నిబంధనలను అతిక్రమించి షాపు ఏర్పాటు చేయడం లేదని వెల్లడించారు. అయినా స్థానికులు అంగీకరించకపోవడంతో షాపును మరో చోటుకి తరలించడానికి నిర్వాహకులు అంగీకరించి, సదరు షాపులోని సరుకును అక్కడి నుంచి తరలించడంతో వివాదం సద్దుమణిగింది.
సీకే బాబు ఇంట్లో చోరీ..
3 నెలల జైలు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంట్లో జరిగిన చోరీ కేసులో మహేష్ (30) అనే నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ వెన్నెల బుధవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాతి కథనం మేరకు.. కట్టమంచిలోని సీకే బాబు ఇంట్లో 2023 గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి రూ.లక్ష నగదు చోరీ చేసి పారిపోయాడు. సీకే లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు.. కట్టమంచికి చెందిన మహేష్‌ను అరెస్టు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ ఎంబీసీ వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,252 మంది స్వామివారిని దర్శించుకోగా 25,943 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలాఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.