నచ్చిన రోజే.. రిజిస్ట్రేషన్
ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు మంచి ముహూర్తం లో చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆ శాఖ మీకు ఓ శుభవార్త తీసుకొచ్చింది..మీకు నచ్చిన రోజు.. నచ్చిన సమయం ఎంపిక చేసుకొని వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. కార్యాలయం వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు..మీరు ఎంచుకొన్న రోజు నింపాదిగా రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే చాలు.. పని పూర్తి చేసుకొని గంటల్లోనే ఇంటికి చేరుకోవచ్చు.. ఈ కొత్త స్లాట్ బుకింగ్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
చిత్తూరు కార్పొరేషన్ : ఆస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్స్‌కు ఇక స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు. నిర్ధేశించిన సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొనే విధంగా వెసులుబాటు ఇచ్చారు. ఈ విధానం విజయవాడలోని కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశ పెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో అన్ని జిల్లాలో వీటిని దశల వారీగా అమలు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి జిల్లా అర్బన్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (ఆర్‌ఓ)లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.
మంచి ముహూర్తాలు, మంచి రోజులు చూసుకుని ఎక్కువ మంది ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. ఒకే సమయంలో కోనుగోలు, విక్రయదారులు రావడంతో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఇతర రోజుల్లో అంత మొత్తంలో లావాదేవీలు జరగవు. పని మీద కార్యాలయానికి వెళ్తే దాదాపు ఒకరోజు అంతా అక్కడే గడపాల్సి వస్తోంది. దీంతో స్లాట్ బుకింగ్ విధానంపై జిల్లాలోని సీనియర్ సహాయకులకు షెడ్యూల్ వారీగా తాడేపల్లెలోని ఐజీ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ప్రయోగాత్మకంగా మొదట జిల్లా కేంద్రంలో వీటిని అమలు చేసి తర్వాత అన్ని కార్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు.
గంటకు ఆరుగురికి
జిల్లా పరిధిలో మొత్తం 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో రోజు 200–250 వరకు దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం నందు జరుగుతున్నాయి. తొలుత జిల్లా కేంద్రం (ఆర్‌ఓ)లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వినియోగదారులు వారు కోరుకున్న రోజు, సమయం సంబంధిత వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. నిర్ధేశించిన సమయానికి కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. గంటకు ఆరుగురు చొప్పున స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక వేళ ఆ రోజు, ఆ సమయానికి రాని పక్షంలో మరుసటి రోజు రావాల్సి ఉంటుంది.
అందుబాటులోకి స్లాట్ బుకింగ్ సేవలు
ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు
నిర్దేశించిన సమయానికి వచ్చే వెసులుబాటు
ఆస్తుల రిజిస్ట్రేషన్స్‌కు తప్పనున్న ఇబ్బందులు
వేచిచూసే పని ఉండదు
స్లాట్ బుకింగ్ విధానంతో క్రయ, విక్రయదారులు కార్యాలయం నందు వేచిచూసే పని తప్పుతుంది. వారికి కావాల్సిన సమయానికి రిజిస్ట్రేషన్‌కు హాజరు కావచ్చు. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు రావాల్సి ఉంది.
– ఏవీఆర్ మూర్తి, జిల్లా రిజిస్ట్రార్
నచ్చిన రోజే.. రిజిస్ట్రేషన్