ఇళ్ల నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : ఇళ్ల నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇళ్ల నిర్మాణానికి అదనంగా 50 వేల నుంచి లక్ష వరకు అందిస్తున్న ప్రభుత్వ ఆర్థిక సహాయంపై అవగాహన పెంచాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పనుల్లో పురోగతి ఉండేలా హౌసింగ్ అధికారులు పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో 17,898 మంది లబ్ధిదారులకు రూ.119.65 కోట్లు లబ్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు అవగాహన కల్పించి వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. అదనపు సాయం పొందేందుకు బేస్‌మెంట్ స్థాయిలో ఏఈ, రూఫ్ లెవల్ స్థాయిలో డీఈలు బాధ్యత తీసుకుని ఇళ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీ నుంచి 23 వరకు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయంపై అవగాహన చేపట్టాలన్నారు. గృహ నిర్మాణాల్లో చివరి దశకు రావాలంటే ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు, ఇంటి బయట, లోపల పెయింటింగ్ మిగిలిన స్థాయిల్లో పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణాల పురోగతికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ గోపాల్‌నాయక్, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
Comments
Please login to add a commentAdd a comment