
మూసానా...మజాకానా
● కూటమి నేత అక్రమ రేషన్ వ్యాపారం గుట్టురట్టు ● తిమ్మసముద్రం కోడిగుట్టలో తాళం పగలగొట్టి రూ.1.24 లక్షలు విలువ చేసే 5టన్నుల బియ్యం స్వాధీనం ● అక్రమ వ్యాపారి టీడీపీ నేత మూసపై 6ఏ కేసు నమోదు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేత అక్రమ రేషన్ వ్యా పారం గుట్టు రట్టు అయ్యింది. అక్రమ నిల్వలు బట్టబయలయ్యాయి. రూ.1.24 లక్షలు విలువ చేసే 5 టన్ను ల బియ్యం నిల్వలను రెవెన్యూ అధికారులు, పోలీసులు తాళం పగలగొట్టి పట్టుకున్నారు. బియ్యం అక్రమ వ్యాపారిగా పేరుమోసిన కూటమి నేత మూసాపై శుక్రవారం 6ఏ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తీగా కదిలిస్తే డొంకా కదిలింది. రేషన్‌బి య్యాన్ని సన్నబియ్యంగా మార్చి రూ.లక్షల్లో ఆదా యం గడిస్తున్నట్లు అధికార వర్గాలు గుర్తించాయి.
పట్టుబడింది ఇలా...
చిత్తూరు నగరం మురకంబట్టు ప్రాంతంలోని తిమ్మసముద్రం కోడిగుట్టలో మూసా అనే కూటమినేత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు స్థానికులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం రాత్రి రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులకు మూసా కనిపించకుండా పోయాడు. పలుమార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో అక్రమ నిల్వ ఉన్న ఇంటి తాళం పగలగొట్టారు. దీంతో భారీగా అక్రమ బియ్యం నిల్వలు బయటపడ్డాయి. 5 టన్నుల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.24 లక్షలుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో ఆర్‌ఐ దినేష్ సమక్షంలో పంచనామా రాశారు. 6ఏ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు విషయాలు బయటపడ్డాయి.
దందా ఇలా..
మూసాకు అక్రమ రేషన్ వ్యాపారం మజాగా మారింది. కొంతమంది డీలర్లను చేతిలో వేసుకుని అక్రమ దందాకు ఆజ్యం పోస్తున్నాడు. డీలర్ల ద్వారా బల్క్‌గా రేషన్ బియ్యం సేకరించి, అక్రమ బియ్యం వ్యాపారం దర్జాగా చేసుకుంటున్నాడు. అలాగే కొంత మంది అక్రమ వ్యాపారులతో చేతులు కలిపి అక్రమ బియ్యం దందాకు తెరలేపుతున్నాడు. ఇలా భారీగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసుకుని సన్నబియ్యంగా మార్చేస్తున్నాడు. బ్రాండ్ పేరుతో మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని సరిహద్దులు దాటిస్తున్నాడు. సన్నబియ్యంగా మార్చిన బియ్యాన్ని లారీల్లో నింపి అధికంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకసారిగా రూ. 5 లక్షలకుపైగా విలువ చేసే సరుకు హద్దులు దాటి వెళుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం ఆనోటా..ఈ నోటా పడి అలా అధికారుల చెవిలో పడడంతో అక్రమ బియ్యం గుట్టు రట్టు అయ్యింది. రెడ్‌హ్యాండెడ్‌గా చేతికి చిక్కింది. మూసాపై కేసు నమోదు చేశారు. కానీ అతని అక్రమ వ్యాపారంలో భాగమైన మరో ఇద్దరిపై కేసు నమోదు చేస్తారా? లేదా..అనేది ప్రశ్నర్థాకంగా మారింది. భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడితే కేవలం ఆ ఒక్క వ్యక్తిపై కేసు నమోదు చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీడీపీ కన్నుసన్నల్లో జరుగుతున్న అక్రమవ్యాపారాలు బట్టబయలవుతున్నా అధికారులు చోద్యం చూడడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు అక్రమ వ్యాపారుల మామూళ్ల మత్తుల్లో జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది నిజమే..?
రెండు రోజుల నుంచి అధికారులకు అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై ఫిర్యాదులు జోరందుకున్నాయి. అధికారులు తాళం పగలగొట్టక ముందు 10 టన్నులకు పైగా బియ్యం ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ ఒత్తిడితో 5 టన్నులకు పైగా బియ్యాన్ని మళ్లించారని తెలుస్తోంది. ఆ తర్వాతే తాళం పగలకొట్టి మిలిగిన 5 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నట్లు చూపించారనే ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment