వ్యక్తిగత గొడవలతో హత్య
● నిందితుడు, బాధితులు బంధువులే
పుంగనూరు : వ్యక్తిగత గొడవల కారణంగా పుంగనూరు మండలంలో ఓ యువకుడు దూరపు బంధువును శనివారం హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ (55), ఆయన కుమారుడు సురేష్ ఈనెల 10న ట్రాక్టర్‌తో మట్టి తోలుకుంటుండగా అదే గ్రామానికి చెందిన దూరపు బంధువులైన వెంకటరమణ, అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమ ఇంటి ముందుగా ట్రాక్టర్ వెళ్లకూడదని గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో రామకృష్ణ కుటుంబ సభ్యులు, వెంకటరమణను కించ పరుస్తూ ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. దీనిని గమనించిన పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రామకృష్ణ, ఆయన కుమారుడు సురేష్‌పై వెంకట రమణ కొడవలితో దాడి చేశాడు. ఇద్దరూ తీవ్రంగా గాయ పడడంతో మదనపల్లె ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రామకృష్ణ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆస్పత్రి వద్ద ఆందోళన..
ఈ కేసులో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదని, బాధిత కుటుంబం మదనపల్లె ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. గతంలో నిందితుడికి, హతుడికి జరిగిన కేసుల్లో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదని ఆరోపించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి మదనపల్లెలో బాధిత కుటుంబీకులను పరామర్శించారు.
వ్యక్తిగత గొడవలతో హత్య
Comments
Please login to add a commentAdd a comment