బైక్ అదుపుతప్పి టీచర్ మృతి
చౌడేపల్లె : మండలంలోని చౌడేపల్లె – మదనపల్లె రోడ్డులోని బోయకొండ సమీపంలోని పక్షిరాజపురం వద్ద ఆదివారం బైక్ బోల్తాపడి ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. మదనపల్లె పట్టణం ఎన్‌వీఆర్ లేఅవుట్‌లో నివాసముంటున్న ఎం.వెంకటరమణ(55) చౌడేపల్లెలో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా పక్షిరాజపురం వద్ద బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి
– ఇద్దరికి తీవ్రగాయాలు
కుప్పం : నియోజకవర్గంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో జయప్ప (65) అక్కడికక్కడే మృతి చెందాడు. శాంతిపురం మండలం సొన్నేగానిపల్లి గ్రామానికి చెందిన జయప్ప కర్ణాటక రాష్ట్రం కామసముద్రంలో తన కూతురు ఇంటికి వెళ్లి తిరిగీ వస్తుండగా మార్గమధ్యలో పలమనేరు నుంచి కుప్పానికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పం నుంచి మల్లానూరు ప్రధాన రోడ్డు మార్గంలో వానగుట్టపల్లి వద్ద ఓ కారు ద్విచక్ర వాహనదారుడిని ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుప్పం నుంచి స్వగ్రామానికి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు సింగారవేలు, మురళీలను మల్లానూరు నుంచి కుప్పం వైపు వస్తున్న ఓ కారు ఢీకొంది. దీంతో సింగారవేలు, మురళీలకు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురు కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పి టీచర్ మృతి
బైక్ అదుపుతప్పి టీచర్ మృతి