విద్యార్థుల ఆకలి కేకలు
● పది పరీక్ష కేంద్రాల బడుల్లో ఇబ్బందులు ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా పది పరీక్ష కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం విద్యార్థులు ఆకలి కేకలు పెట్టాల్సి వచ్చింది. జిల్లాలోని 70 సర్కారు బడుల్లో పరీక్ష కేంద్రాలను ఎర్పాటు చేశారు. ఆయా బడుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పెట్టాలంటే ఉదయం నుంచి కార్మికులు బడుల్లోనే వంట చేయాల్సి వస్తుంది. అయితే పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పోలీసులు వంట మనుషులను లోనికి అనుమతించని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం పాఠశాలలకు వచ్చే విద్యార్థుల కోసం భోజనం ఎక్కడ వండాలో తెలియని దుస్థితి దాపురించింది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్షేత్రస్థాయి అధికారులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. సమీపంలోని ప్రాథమిక పాఠశాల, వసతి గృహాలుంటే అక్కడ మధ్యాహ్నభోజనం తయారు చేయించాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు ప్రాథమిక పాఠశాలలు, వసతి గృహాల్లో వంట చేసుకుని ఆటోల్లో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వడ్డించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులకు ఆహారం అందక పస్తులుండాల్సి పరిస్థితి తలెత్తింది. దీంతో విద్యాశాఖ అధికారులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment