కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు
ఐరాల: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. బుధవారం మండలంలోని అగరంపల్లె జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మార్చి 17 నుంచి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 1వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేశామన్నారు. జిల్లాలో 118 కేంద్రాల్లో సుమారు 21 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలుకు హాజరవుతున్నారన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి వసతితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు, మెడికిల్ కిట్ అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందుగానే చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయడంతో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్‌కుమార్, ఎంఈఓ రుషేంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే
వేటు ఖాయం
– నలుగురు ఇన్విజిలేటర్ల తొలగింపు
చిత్తూరు కలెక్టరేట్ : పదోతరగతి పబ్లిక్ పరీక్షల విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చీఫ్, డిపార్ట్‌మెంట్, ఇన్విజిలేటర్లపై వేటు ఖాయమ ని జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రెండు పాఠ్యాంశాలకు సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. విద్యార్థుల పరంగా ఎలాంటి డిబార్ జరగకపోగా, విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. పూతలపట్టులో ఇద్దరు, నగరిలో ఒకరు, జీడీనెల్లూరు నెల్లేపల్లి పరీక్ష కేంద్రంలో ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించారు. పది పరీక్షల అబ్జర్వర్ జ్యోతికుమారి బుధవారం జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని, డీఆర్వో మోహన్‌కుమార్ కొంగారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి నగరపాలక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 13 మంది 55 పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్‌ల సభ్యులు 41 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. హిందీ పరీక్షకు 20,609 మంది విద్యార్థులకు గాను 20,198 మంది హాజరుకాగా 411 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు.