బెట్టింగ్‌ మాఫియా! | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ మాఫియా!

Published Fri, Mar 21 2025 1:58 AM | Last Updated on Fri, Mar 21 2025 1:54 AM

బెట్టింగ్‌ మాఫియా!

బెట్టింగ్‌ మాఫియా!

● రేపటి నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం ● విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల జోరు ● టాస్‌ నుంచి మ్యాచ్‌ ముగిసే దాకా పందాలు ● ఊబిలోకి జారుతున్న క్రికెట్‌ అభిమానులు ● ఆన్‌లైన్‌ ద్వారానే లావాదేవీలు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఇలా..

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ చేసేవారు కొన్ని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.ఆ తరువాత మ్యాచ్‌ను ప్రత్యక్షంగానూ పరిశీలిస్తూ పందేలు కాస్తారు. మ్యాచ్‌ చూసేందుకు ఒక మొబైల్‌, బెట్టింగ్‌ కాసేందుకు మరో మొబైల్‌ వినియోగించి ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బుకీలు సంప్రదింపులు జరుపుతుంటారు. బార్‌లు, ఇళ్ల మధ్య స్థావరాలు ,క్రికెట్‌ గ్రౌండ్‌లు ఏర్పాటు చేసుకొని వ్యవహారాన్ని చక్క బెట్టుకొంటున్నారు.

గుడిపాల : క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా చాపకింద నీరులా సాగుతోంది. ముఖ్యంగా ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువగా ఉంటోంది. క్రికెట్‌ బుకీలు ఏకంగా తిష్ట వేసి క్రీడాభిమానులను ఈ రొంపిలోకి దింపి సొమ్ములు చేసుకుంటున్నారు. క్రికెట్‌ పిచ్చి ఉన్న పలువురు ఈ ఊబిలోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు యువత మ్యాచ్‌లను తిలకించేందుకు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. అదే సమయంలో వారి ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగుతుంటారు. క్రికెట్‌ అంటే అభిమానమా..మీ పేవరేట్‌ టీమ్‌ గెలుస్తుందనే నమ్మకం మీకుందా.. నిజంగా ఉంటే బెట్టింగ్‌ కట్టచ్చు కదా.. సరదా తీరుతుంది.. డబ్బులు గెలుచుకోవచ్చు..అంటూ వారిని చిన్నగా ఊబిలోకి దించుతున్నారు.

జిల్లాలోని పలు నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. బెట్టింగ్‌ అంతా దాదాపుగా ఫోన్‌లోనే జరుగుతుంది. ఇరువర్గాలను ఫోన్‌లోనే కాంటాక్ట్‌ చేసి బెట్టింగ్‌ కాయిస్తారు. గెలిచిన వారి నుంచి కమీషన్‌ పొందుతారు.పట్టణాలు, పల్లెల్లోని యువకులను టార్గెట్‌ చేస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా చిత్తూరు నియోజకవర్గంలో ఎంతో మంది యువకులు అప్పులపాలైన సంఘటన లు లేకపోలేదు.మరికొందరు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

ప్రతి బాల్‌కో రేటు

టాస్‌ వేసే సమయం నుంచి బ్యాటింగ్‌ ఎవరు ఎంచుకొంటారు... బౌలింగ్‌ ఎవరు చేస్తారు...నుంచి బెట్టింగ్‌ ప్రారంభమవుతుంది.ఏ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తారు.బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి..ఎవరు గెలుస్తారు..ఎన్ని పరుగులతో మ్యాచ్‌ పూర్తవుతుంది.ఇలా ప్రతిదానికీ ఒక పందెం ఉంటుంది.

మొదలైన జోరు

గ్రామాల్లో బెట్టింగ్‌ల జోరు అప్పుడే మొదలైంది. రేపటి నుంచి ఐపీఎల్‌–2025 క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమమై.. మేనెల 25వతేదీన ముగుస్తాయి. ఇందులో బెట్టింగ్‌ల జోరు అప్పుడే ఊపందుకుంది. ఎక్కువగా చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌, ముంబయి టీమ్‌లపై యువకులు బెట్టింగ్‌లు కాస్తున్నారు.

ఫోన్‌లోనే మంతనాలు

బెట్టింగ్‌ వ్యవహారం మొత్తం ఫోన్‌లోనే సాగుతోంది. చాలాచోట్ల ఎస్‌..నో..ఓకే...డన్‌..ఈటింగ్‌ వంటి కోడ్‌ లాంగ్వేజీని దీనికోసం వాడుతుంటారు. క్రికెట్‌పై పెద్దగా పరిజ్ఞానం లేకున్నా ఆడుతుంది..గెలుస్తుంది...ఓడుతుంది అనే సూత్రాలతో పందేలు కాస్తుంటారు.చాలా మంది టీవీలు చూస్తూనే పందేలు కడుతుంటారు.గ్రౌండ్‌లో చూసే ఆటకు, టీవీల్లో చూసే వారికి మూడు బంతుల సమయం తేడా ఉంటుంది. బంతి బంతికి ఆట ఎలా ఉంటుందో ముందే తెలుసుకొని బెట్టింగ్‌ కాసేవారి జేబులను బుకీలు గుల్ల చేస్తున్నారు. మ్యాచ్‌ ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో అనే కాకుండా ఎవరు ఎన్ని పరుగులు చేస్తారు...ఈ ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయనే కోణంలోనూ పందాలు కాస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement