వసతిగృహాల్లో వైద్య సిబ్బంది ఉండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సాంఘిక సంక్షేమ (ఎస్సీ) వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖఽ అధికారి చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను పూర్తిగా భర్తీ చేయాలన్నారు. వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల చాలా మంది వార్డెన్‌లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కామాటి, వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఎస్సీ బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వసతి గృహంలో డాక్టర్, నర్సు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు మురళి, భాస్కర్, షణ్ముగం, మహేష్ పాల్గొన్నారు.
బోయకొండలో వేలం పాట వాయిదా
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో వివిధ హక్కులపై లీజుకిస్తూ నిర్వహించాల్సిన వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు ఈఓ ఏకాంబరం ప్రకటించారు. ఐదు హక్కులపై వేలం పాటను అధికారులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేలం పాటదారులు పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఈనెల 28వ తేదీకి వాయిదా వేసినట్లు ఈఓ తెలిపారు.
లారీని ఢీకొన్న కారు
గంగవరం: లారీని ఎదురుగా కారు ఢీకొట్టిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. పలమనేరు వైపు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ లారీని ఎదురుగా అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న పృధ్వి(22), పక్క సీట్లో కూర్చున్న సూర్య(21) ఇద్దురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్యాంకర్ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment