గురుకులాలకు దరఖాస్తు గడువు పెంపు
సదుం : ఉమ్మడి జిల్లాల్లోని ఎంజేపీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం కోసం దర ఖాస్తు గడువును పెంపొందించినట్లు శుక్రవా రం గురుకులాల కన్వీనర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశానికి, 6, 7, 8, 9 తరగతులలో బ్యాక్‌లా గ్ సీట్ల భర్తీకి ఈనెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్ 4న ఇంటర్ , 27న 5వ తరగతి, 28న 6,7,8,9 తర గతులలో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. సదుం, సత్యవేడు, తంబళ్లపల్లె, ఐతేపల్లె, కుప్పం, కలికిరి, పీలేరు, ఉదయమాణిక్యం, పెద్దపంజాణి, పులిచర్లలోని ఎంజేపీ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు.
మెడికల్ దుకాణాలపై
విజిలెన్స్ దాడులు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరలోని పలు మెడికల్ దుకాణాలపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రీజినల్ అధికారి కరీముల్లా, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కీర్తన, పోలీసు అధికారులు మహేశ్వర్, అనిల్‌కుమార్ బృందాలుగా కలిసి దాడులు నిర్వహించారు. వైద్యుడి సిఫార్సు లేకుండా కొన్ని మందులు ఇవ్వడం, బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్న కొంగారెడ్డిపల్లె అపోలో, మురకంబట్టు మెడ్‌లైఫ్ దుకాణాల లైసెన్సుల రద్దుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.
నిధుల దుర్వినియోగంపై కార్యదర్శి సస్పెన్షన్
చిత్తూరు కలెక్టరేట్ : పంచాయతీ నిధుల దుర్వినియోగంపై బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీ కార్యదర్శి ఉమాపతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పంచాయతీ నిధులు రూ.3,68,441 దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ నిధుల పై సమగ్ర విచారణ చేసిన అనంతరం ఉమాపతిని సస్పెండ్ చేశారు. దుర్వినియోగం అయిన నిధులను రికవరీ చేయాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశిస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
సర్పంచ్‌కు షోకాజ్ జారీ
చిత్తూరు కార్పొరేషన్ : నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసులుకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు డీపీఓ సుధాకర్‌రావు తెలిపారు. వారం రోజుల లోపు వీటిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో
24 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్ : మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందికి రూ.2.40 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.2.40 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
పంటలు ఎండుతున్నాయని కార్యాలయానికి తాళం
– కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు ఇవ్వాలని రైతుల నిరసన
పలమమేరు : పట్టణంలోని గంగవరం మండల ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయానికి శుక్రవారం ఆ మండలానికి చెందిన పలువురు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. మండలంలో రైతులకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లు కాలి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కోసం వస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment