తెలుగు సాహిత్యానికి పోతన దిక్సూచి
● భాగవతంలోని బ్రహ్మ సూత్రాలను తెలుసుకోవాలి ● జాతీయ సదస్సులో యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు వెల్లడి
పలమనేరు : నేను, నీవు అనే భేదాలను విడిస్తే జీవితం ఉన్నతంగా ఉంటుందని భాగవతం ద్వారా మానవాళికి సూచించిన మహోన్నతుడు పోతన అని యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భాగవతం–భక్తి, తాత్వికత, సామాజికత అనే అంశంపై జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి జీవం పోసిన పోతన మన తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టమన్నారు. ముఖ్యంగా భాగవతంలోని 555 బ్రహ్మ సూత్రాలను మనం తెలుసుకోవాలని సూచించారు. మానవ జన్మకు అర్థం, పరమార్థం తెలుసుకోవాలంటే కచ్చితంగా భాగవతాన్ని చదవాలన్నారు. అనంతరం స్థానిక కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు మాట్లాడుతూ.. ప్రతిఫలం ఆశించకుండా చేసే యజ్ఞ యాగాదుల గురించి భాగవతంలో విఫులంగా వివరించారన్నారు. సదస్సు సంచాలకులు వాసు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ ఇతిహాసాలను చదవని వారెందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment