రోడ్డు ప్రమాదంలో చెల్లెలు మృతి
● అన్నకు తీవ్ర గాయాలు ● రోడ్డుదాటుతుండగా ఢీకొట్టిన కారు
నగరి : అన్నా చెల్లెళ్లను విధి శాశ్వతంగా విడదీసింది. ముక్కు పచ్చలారని చిన్నారిని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. కూలి పనులతో పొట్ట నింపుకొని ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఆనందంగా గడిపే ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదం నింపింది. శనివారం వీకేఆర్ పురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఈ విషాదానికి కారణమైంది. ఈ రోడ్డు ప్రమాదంలో జి.నోమేశ్వరి (10) మృతి చెందగా, సోదరుడు జి.మహేష్ (14) తీవ్ర గాయాలపాలయ్యాడు. సీఐ విక్రమ్ తెలిపిన వివరాల మేరకు వీకేఆర్ పురం జగనన్న కాలనీలో ఉంటున్న కూలీలు గోపి, బుజ్జి దంపతుల కుమారుడు జి.మహేష్ తడుకుపేట జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె నోమేశ్వరి.. ఎంఎన్ కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నమే బడి అయిపోయింది. అయితే తడుకుపేట పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో మధ్యాహ్నం నుంచి ఒంటి పూట బడి జరుగుతుంది. దీంతో అన్న వచ్చే వరకు ఎంఎన్ కండ్రిగలో బంధువుల ఇంటి వద్ద నోమేశ్వరి వేచి ఉంటుంది. ఇద్దరూ కలసి సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. ఈ క్రమంలో శనివారం 4 గంటలకు ఇంటికి వెళ్లడానికి ఇరువురు రోడ్డు దాటుతుండగా చైన్నె వైపుగా వెళ్లే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నోమేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, మహేష్ గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పిల్లల పెద్ద సోదరుడు భూపతి ఐటీఐ చదువుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో చెల్లెలు మృతి
Comments
Please login to add a commentAdd a comment