
కనిపించని సౌర వెలుగులు
● సూర్యఘర్ పథకంపై నిరాసక్తత ● రాయితీ ఉన్నా వినియోగించుకోని వైనం ● జిల్లాలో దరఖాస్తులు 5 వేలు ● 250 యూనిట్లే ఏర్పాటు
చిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకానికి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సౌర ఫలకాల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మార్చి నాటికి జిల్లాలో సుమారు 6 వేల యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5 వేల మంది దరఖాస్తు చేయగా, 288 మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 250 మంది ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇందులో చిత్తూరు డివిజన్‌లోనే 146కు పైగా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకొని సోలార్ యూనిట్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సొంత ఇంటి పై సౌర పలకాలు ఏర్పాటుతో సొంతంగా విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవచ్చు. మిగులు విద్యుత్‌ను శాఖా పరంగా కొనుగోలు చేసి బిల్లులో సర్దుబాటు చేయనున్నారు. ఒకేసారి పెట్టుబడి పెడితే కరెంటు బిల్లు జోలికి పోవాల్సిన అవసరం ఉండదు.
ఆసక్తి చూపని జిల్లావాసులు
సౌర విద్యుత్‌కు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. బ్యాంకు రుణాలకు బ్యాంకర్లు మొండిచేయి చూపడంతో వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో.. భవిష్యత్తులో అందరికీ ఇలా పెడతారనే నమ్మకంతో కొంత మంది ఉన్నారు. దీనికి తోడు కుప్పం నియోజకవర్గం మొత్తం పైలట్ ప్రాజెక్టుగా అందరికీ అందించనున్నారు. పెట్టుబడి లేకుండా సొలార్ పలకాలను ఏర్పాటు చేయనున్నారు. యూనిట్ వ్యయం రికవరీ అయ్యే వరకు విలువ మొత్తంను మిగులు విద్యుత్‌లో మినహాయించుకోనున్నారు. ఈ విధానం విజయవంతం అయితే కొన్ని సంవత్సరాల తర్వాత జిల్లా అంతటా పెడతారని భావిస్తున్నారు. డీలర్లు అయిదేళ్ల పాటు ఉచిత సర్వీసు అందిస్తున్నారు. ఈ పథకంను కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చింది. సౌర విద్యుత్ ప్యానళ్లు, ఇతర సామగ్రికి అయ్యే వ్యయంలో కొంత మొత్తం ప్రభుత్వం రాయితీ అందజేస్తోంది.
ఆదాయం పొందవచ్చు
మొత్తం విద్యుత్ వినియోగం ఆధారంగా 120 యూనిట్లలోపు ఉన్న వారికి 1 కిలోవాట్ అవసరమవుతుంది. దీనికి రూ.30,000 రాయితీని అందిస్తున్నారు. 240 యూనిట్లు నెలకు వాడుకునే వారికి 2 కిలోవాట్లు అవసరం కాగా రూ.60,000 రాయితీ ఇస్తున్నారు. 360 యూనిట్లు వినియోగిస్తున్న వారికి 3 కిలోవాట్లు అవసరమవుతుంది. వీటికి రూ.78,000 రాయితీ ఇస్తున్నారు. దాదాపు రూ.2 లక్షలు విలువైన 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల రాయితీ కల్పించింది. రూ.20 వేలు లబ్ధిదారుడి వాటాపోనూ మిగిలిన మొత్తానికి 7 శాతం తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం పొందవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి దాదాపు రూ.32 వేలు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వినియోగించుకున్న మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా యూనిట్‌కు రూ.2.09 ఆదాయం పొందవచ్చు. రుణం పొందేందుకు బ్యాంకులకు సెక్యూరిటీ కింద ఎటువంటి డాక్కుమెంటులు సమర్పించాల్సిన అవసరం లేదు.
అపోహలు వద్దు
సోలార్ పవర్ వల్ల విద్యుత్ బిల్లు భారీగా తగ్గుతుంది. మొదట పెట్టుబడి ఎక్కువగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్ టాప్ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదు. బ్యాంకులు రుణంగా ఇస్తాయి. బ్యాంకు అప్పు తీరిపోతే 15 సంవత్సరాల పాటు ఇంటికి ఉచితంగా విద్యుత్ పొందడంతో పాటు మరికొంత సొమ్ము ఎస్పీడీసీఎల్ నుంచి వస్తుంది. – ఇస్మాయిల్ అహ్మద్, ఎస్‌ఈ ట్రాన్స్‌కో
Comments
Please login to add a commentAdd a comment