
కళాశాల వేడుకలో వినూత్న నిరసన
పలమనేరు : పలమనేరు సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి కళాశాల వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పలువురు విద్యార్థులు వైఎస్సార్‌సీపీ జెండాలతో నృత్యం చేస్తూ జగనన్న జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రజాప్రతినిధితో పాటు కళాశాల యాజమాన్యం సైతం ఖంగుతింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాటలు వేసి వినిపించినా విద్యార్థులు తామే తగ్గేదేలేదంటూ జగనన్న నినాదాలతో హోరెత్తించారు. జగన్నన విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకుండా చేసిన కూటమి సర్కార్‌పై ఈ విధంగా విద్యార్థులు నిరసన తెలిపారు. దీంతో కళాశాల నిర్వాహకులు సైతం చేసేదీమీ లేకుండా పోయింది. కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధి సైతం మిన్నుకుండిపోవాల్సి వచ్చింది.