వాస్తవాలు వెలుగులోకి తెస్తే కేసులా ?
వెదురుకుప్పం : గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి, ఇసుక దోపిడీపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ విలేకరిపై కేసులు నమోదు చేయాలంటూ జనసేన నాయకులు ఫిర్యాదు చేయడం చూస్తే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా వ్యవహారం ఉంది. సోమవారం ‘దమ్ముంటే పట్టుకో’ అంటూ జిల్లాలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ దోపిడీపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. అయితే ఈ కథనం జనసేన నాయకుల గుండెల్లో గుబులు రేపినట్లు ఉంది. మంగళవారం వెదురుకుప్పం ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యకు ‘సాక్షి’ విలేకరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తే కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఎవరినీ ఉద్దేశించి గానీ ఎవరి పేరు పెట్టి కానీ వార్తలు రాయకనే కేవలం జనసేనకు చెందిన నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, యువ నాయకులు చందు, మండల ప్రధాన కార్యదర్శి ముని, కార్యదర్శి పనరమేశ్వర్ కలిసి ఫిర్యాదు చేశారు. అది కూడా జనసేన నియోజవకర్గ ఇన్‌చార్జి పొన్న యుగంధర్ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలపడం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వెదురుకుప్పం : మండలంలోని చిన్నపోటుచేను సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కథనం మేరకు..కార్వేటినగరం మండలంలోని కేపీ అగ్రహారం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు రవి(26) తిరుపతిలోని ఓ పెట్రోలు బంక్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో పచ్చికాపల్లం పరిధిలోని చిన్నపోటుచేను వద్ద ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రవి తలకు బలమైన గాయం తగిలి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. గాయపడిన రవిని పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శవ పరీక్ష నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వాస్తవాలు వెలుగులోకి తెస్తే కేసులా ?