
అర్హులందరికీ వ్యవసాయ పరికరాలు
పలమనేరు : జిల్లాలో 50 శాతం సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా అర్హులైన వారికి తప్పకుండా పరికరాలను అందజేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సృష్టం చేశారు. ఆ మేరకు తమ్ముళ్లకు యంత్రసాయం అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. స్థానిక వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో పలమనేరు, కుప్పం ఆశాఖ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి దాకా మండలాల వారిగా వ్యవసాయ పరికరాలకు ఎంత మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్యం ఎంత, ఇప్పటి దాకా ఎంత చేశారని అడిగి తెలుసుకున్నారు. ఇందులో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను రాజకీయ నేతలకు ఎందుకు ఇస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. జిల్లాలో మొత్తం 3.24 లక్షల మంది రైతులుండగా వీరిలో 2.25 లక్షల మంది ఇంకా రైతు గుర్తింపు కార్డులకు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. అనంతరం కూర్మాయి గ్రామంలో రైతు చందూల్‌రెడ్డి సాగు చేసిన దేశీయ వరి పంటను ఆయన సందర్శించారు. ఆపై ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన నలభై రకాల టమాట విత్తనాలను పరిశీలించారు. ఏడు మండలాల ఏవోలు, ఏడీ గీతాకుమారి, జెడ్‌బీఎన్‌ఎస్ మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

అర్హులందరికీ వ్యవసాయ పరికరాలు