చిత్తూరు అర్బన్ : చిత్తూరులో పనిచేసి బదిలీపై వెళుతున్న ఇద్దరు న్యాయమూర్తులను శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ నాయకులు సన్మానించారు. చిత్తూరులో పనిచేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, అదనపు జిల్లా జడ్జి బాబు నాయక్ సేవలు మరువలేనివన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వీరు చూపిన చొరవ అభినందనీయమన్నారు.
కేసుల పరిష్కారంలో న్యాయవాదులతో కలిపి కక్షిదారులకు సత్వర న్యాయం అందించారని కొనియాడారు. అనంతరం న్యాయమూర్తులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద మండలి అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథ రెడ్డి, చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌నాయుడు, సురేష్‌రెడ్డి, న్యాయమూర్తులు రమేష్ , శ్రీనివాసులు, భారతి, మాధవి, వెన్నెల పాల్గొన్నారు.
దుప్పిని రక్షించిన గ్రామస్తులు
బంగారుపాళెం : మండలంలోని జిల్లేడుపల్లెలో శుక్రవారం కుక్కల బారిన పడిన దుప్పిని గ్రామస్తులు పట్టుకుని అటవీశాఖ అధికారుల అప్పగించారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి నీటి కోసం వ్యవసాయ పొలాల సమీపంలోకి రావడాన్ని ఊర కుక్కలు గుర్తించి దాడి చేశాయి. ప్రాణ భయంతో దుప్పి జిల్లేడుపల్లె గ్రామంలోకి పరుగులు తీసింది.
ఈ విషయాన్ని గుర్తించిన మాజీ సర్పంచ్ జ్యోతీశ్వర్‌రెడ్డి గ్రామస్తుల సహకారంతో దుప్పిని రక్షించారు. విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అటవీశాఖ అధికారులు జిల్లేడుపల్లె గ్రామానికి చేరుకొని దుప్పిని స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం దుప్పిని అటవీ ప్రాంతంలో వదలి పెట్టారు.
విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
గుడిపాల: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందింది. గుడిపాల మండలంలోని సీకేపల్లె గ్రామానికి చెందిన గోవిందరాజులునాయుడు అనే రైతు తన పాడి ఆవును పొలం వద్ద చెట్టుకు కట్టి ఉండగా విద్యుత్ తీగలు గాలికి చెట్టుకు తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురై పాడి ఆవు మృతి చెందింది. పాడి తనకు జీవనాధారమని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రైతు కోరారు.

న్యాయమూర్తులకు సన్మానం