
● బంతిపూల ధరలు నేల చూపు ● పెట్టుబడి ఖర్చులు దక్కని వైనం
కుప్పం రూరల్ : కుప్పంలో బంతిపూల ధరలు నేల చూపు చూస్తున్నాయి. రైతులు పెట్టుబడి రాక పూలను తోటల్లోన్నే వదిలిపెడుతున్నారు. కుప్పం మార్కెట్‌లో కిలో రూ.5 నుంచి 10 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో రైతులు కోత కూలీ కూడ రాదని ఆవేదన చెందుతున్నారు. కొంత మంది రైతులు ధరలు లేకపోవడంతో మార్కెట్ బయటే పారబోసి వెళ్తున్నారు. మిగిలిన పూల ధరలు ఓ మోస్తరుగా ఉన్నా బంతి పూల ధరలు మాత్రం పతనమయ్యాయి. వ్యాపారులు మాత్రం అధిక దిగుబడే కారణమంటున్నారు.
వివిధ రాష్ట్రాలకు ఎగుమతి
మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పానికి పూలసాగులో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండిన పూలు రాష్ట్రాలు చుట్టి వస్తున్నాయి. ప్రస్తుతం కుప్పం మార్కెట్ నుంచి విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. అన్ని రకాల పూల ధరలు ఓ రకంగా ఉన్నా బంతిపూల ధరలు మాత్రం నేలకు దిగిపోయాయి. కుప్పం మార్కెట్‌లో వారం రోజులుగా సరాసరిన కిలో రూ.10 పలుకుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూలను కోయక తోటల్లోన్నే వదిలిపెడుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎకరాకు 40 వేలు ఖర్చు చేసి బంతిపూలు సాగు చేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. బంతిపూల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేస్తే ధరల రూపంలో ఇలా రైతుల నెత్తిన బండ పడుతోందని వాపోతున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుండడంతో రైతులు పూలసాగు వదిలిపెట్టాల్సి వస్తోందని నిరాశ చెందుతున్నారు. బంతి సాగులో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
సాగు ఖర్చులు రావడం లేదు..
ఎకరా బంతి సాగు రూ.40 వేలు ఖర్చు అవుతుండగా ప్రస్తుతం ధరలతో కోత కూలీ రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 7,500 మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఒక్కో మొక్క ధర రూ.2.50 రూపాయలుగా ఉంది. ఇలా దుక్కులు చేయడం, మొక్కలు నాటడం, ఎరువులు వెరసి ఎకరా సాగుకు రూ.40 వేలు ఖర్చు వస్తోంది. ధరలు పతనం కావడంతో సాగు ఖర్చులు వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. మిగిలిన పూలైన చామంతి కుప్పం మార్కెట్‌లో కిలో రూ.150 – 170, రోజా రూ.80–100, కనకాంబరం రూ.600, మల్లె రూ.280– 320, సంపంగి రూ.60, జాజిమల్లె రూ.240 పలికింది. కానీ బంతి మాత్రమే కిలో రూ.5–10 రూపాయలు పలుకుతున్నాయి. అధిక దిగుబడి రావడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కుప్పంలో టమాట తరువాత రైతులు ఎక్కువ మొత్తంలో బంతి పూలు సాగు చేయడం ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు.
సాగు వదులుకోవాల్సిందే..
రూ.40 వేలు పెట్టుబడి పెట్టి 45 రోజుల పాటు ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే బంతిపూలు చేతికి వస్తాయి. ఈ మధ్యలో చీడపీడలు ఆశిస్తే పంట చేతికి రాదు. నీరు అందుబాటులో లేకపోయిన మధ్యలోనే పంట నష్టపోవాల్సి ఉంది. పంట చేతికి రాగానే ధరల రూపంలో రైతులకు గుదిబండ పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పండుగలు, శుభకార్యాల సమయంలో మాత్రం ఓ మోస్తరుగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో బంతి ధరలు అంతగా ఉండడం లేదు. ధరలు ఇలాగే కొనసాగితే రైతులు బంతి సాగును నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. – చిన్నప్పకాంతరాజ్,
రైతు, పెద్ద బంగారునత్తం

● బంతిపూల ధరలు నేల చూపు ● పెట్టుబడి ఖర్చులు దక్కని వైనం