
టైర్ పరిశ్రమలో భారీ పేలుడు
● చెలరేగిన మంటలు ● భయాందోళనకు గురైన గ్రామస్తులు ● త్రుటిలో తప్పిన ప్రమాదం ● తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం
నగరి : మండలంలోని నాగరాజకుప్పం మార్గంలోని దీపం టైర్ పరిశ్రమలో బుధవారం ఉదయం భారీ పేలుడు శబ్దం వచ్చి అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ప్లాంటుపై ఉన్న ఇనుప రేకులు ఒక్కసారిగా ఎగిరి పొగలు కక్కుతూ పక్కనే ఉన్న రోడ్డుపై పడ్డాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాంటు పక్కనే ఉన్న రోడ్డులో తరచూ ద్విచక్ర వాహనదారులు సంచరిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ ప్రయాణించక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కార్మికులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి భయటకు వచ్చేయడంతో ఎవరూ గాయపడలేదు.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఉదాసీనతే..
ఈ పరిశ్రమలో అగ్ని ప్రమాదం ఇది వరకే సంభవించి పేలుడు దాటికి విద్యుత్ స్తంభాలు వంగిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్లాంటుకు ఆనుకొని నాగరాజకుప్పం, భీరకుప్పం, ఓజీకుప్పం, కృష్ణాపురం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ప్లాంటుకు కూతవేటు దూరంలోనే సుమారు 1300 మందికి కేటాయించిన జగనన్న కాలనీ ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. టైర్లు కాల్చే దుర్వాసన కాలనీలోని నివాసాల వరకు వ్యాపిస్తోందని. దానిని భరించలేకున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్లాంటు పక్కన రోడ్డుపై వెళ్లే సమయంలో ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం మంటలు చెలరేగడంతో దుర్వాసన రెట్టింపైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాసాలకు సమీపంగా ఉన్న ప్రమాదకర పరిశ్రమ నివాసాలకు దూరంగా మార్చి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. పేలుడు శబ్ధం వినిపించినా ప్లాంటు యజమానులు మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా టైర్లు మండి ప్రమాదం సంభవించిందని తెలుపుతోంది.
మండుతున్న టైర్ ప్లాంటు