మరో ‘పరువు’ హత్య | 14 Members Arrested For Hemanth Murder Says Madhapur DCP | Sakshi
Sakshi News home page

మరో ‘పరువు’ హత్య

Published Sat, Sep 26 2020 3:50 AM | Last Updated on Mon, Aug 23 2021 7:54 PM

14 Members Arrested For Hemanth Murder Says Madhapur DCP - Sakshi

సాక్షి, సంగారెడ్డి/హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకున్నదనే నెపంతో కూతురు భర్తనే అతి దారుణంగా హత్య చేశారు. కూతురు కుటుంబంలో కన్నవారే నిప్పులు పోశారు. ప్రణయ్‌ హత్యోదంతాన్ని తలపించిన మరో ఘటన తాజాగా సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి కిరాయి హంతకుడితో ఆమె భర్త ప్రణయ్‌ను హత్య చేయించిన ఘటన మరువకముందే.. మరో పరువు హత్య జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రధాన నిందితుడు యుగేందర్‌రెడ్డి ఫోన్‌ సిగ్నల్‌ను ట్రేస్‌ చేసి గచ్చిబౌలి పోలీసులు పట్టుకోవడంతో విగతజీవిగా పడి ఉన్న చింతా యోగా హేమంత్‌ కుమార్‌ (28) అచూకీ దొరికింది. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.  

పరిచయం ప్రేమగా మారి... 
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన చింతా యోగా మురళీకృష్ణ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి చందానగర్‌లో నివాసం ఉంటోంది. మురళీకృష్ణ, లక్ష్మీరాణి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు అమెరికాలో ఉంటున్నాడు, పెద్దకుమారుడైన హేమంత్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌. ప్రస్తుతం విద్యానగర్‌లో నివాసముండే దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి గతంలో మురళీకృష్ణ ఇంటికి సమీపంలోనే ఉండేవారు. ఈ సమయంలోనే బీటెక్‌ పూర్తి చేసిన లక్ష్మారెడ్డి కూతురు అవంతిరెడ్డి... హేమంత్‌ అమ్మ నిర్వహించే బ్యూటీపార్లర్‌కు వస్తుండేది. అప్పుడు వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇలా వీరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కలిసి బతకాలని నిర్ణయించుకొని జూన్‌ 10న ఇంటి నుంచి పారిపోయారు.  

భర్తతోనే ఉంటానని చెప్పింది..
జూన్‌ 11న కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో హేమంత్, అవంతి పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కావాలని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ను కలువగా చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమని సూచించారు. దీంతో జూన్‌ 16న హేమంత్, అవంతి రెడ్డిలతోపాటు వారి తల్లిదండ్రులు చందానగర్‌ పీఎస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అప్పుడే తన పేరిట ఉన్న దాదాపు రూ.ఐదు కోట్ల ఆస్తులను అవంతి తన తల్లిదండ్రులకు రాసి ఇచ్చింది. ఆ తర్వాత గచ్చిబౌలి టీఎన్‌జీవోస్‌ కాలనీలో అవంతి, హేమంత్‌ అద్దెకు ఉంటున్నారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాలని అనుకున్నారు.  బైక్‌పై రెక్కీ.. ఆ వెంటనే కార్లలో వచ్చి 
గురువారం మధ్యాహ్నం 2.00 గంటలప్పుడు లక్ష్మారెడ్డి డ్రైవర్‌ షేక్‌ సాహెబ్‌ పటేల్‌(48) బైక్‌పై టీఎన్‌జీవోస్‌ కాలనీకి వెళ్లి హేమంత్, అవంతి ఇంట్లోనే ఉన్నారని గమనించి సమాచారాన్ని చేరవేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు మూడు కార్లలో అవంతి ఇంటికి చేరుకున్నారు. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుందని చెప్పి బలవంతంగా లాక్కొచ్చి కారులోకి అవంతిరెడ్డిని ఎక్కించారు. ఒక్కదాన్నయితే రానని చెప్పడంతో అదేకారులో హేమంత్‌ కుమార్‌ను ఎక్కించుకున్నారు.  

దారి మళ్లించడంతో దిగేశారు..
గోపన్‌పల్లి తండా చౌరస్తాకు వెళ్లగానే 3.42 గంటల ప్రాంతంలో ముందు ఉన్న కారు ఎడమ వైపు తిరిగి ఆగింది. ఆ వెంటనే వెనకాల ఆగిన ఐ20 కారు డోర్‌ తీసుకొని అవంతి గౌలిదొడ్డి వైపు, హేమంత్‌ తెల్లాపూర్‌ రోడ్డుపై పరుగులు తీశారు. ఆ దృశ్యాలను పలువురు స్థానికులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశారేకానీ, ఏ ఒక్కరూ ఆపేందుకు ముందుకు రాలేదు. కారు దిగి పరిగెత్తిన విషయాన్ని అవంతి తన మామ (హేమంత్‌ తండ్రి) మురళీకృష్ణకు కాల్‌ చేసి చెప్పింది. ఆయన వెంటనే 3.50 గంటల సమయంలో డయల్‌ 100కు కాల్‌ చేసి చెప్పి బైక్‌పై భార్య లక్ష్మీరాణితో అక్కడికి వచ్చాడు. సుమారు 4.30 గంటల ప్రాంతంలో గోపన్‌పల్లి తండాకు చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు 2 కార్లలో ఉన్న 11 మందిని పట్టుకున్నారు.  

చేజ్‌ చేసి బలవంతంగా కారులో ఎక్కించి... 
హేమంత్‌ కుమార్‌ను యుగేందర్‌రెడ్డి కారులో వెంబడించి సినీఫక్కీలో పట్టుకున్నాడు. అప్పటికే ఆ వాహనంలో ఉన్న బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు హేమంత్‌ పారిపోకుండా మధ్యలో కూర్చోపెట్టుకొని తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే హేమంత్‌ కుమార్‌ చివరగా తన సెల్‌ఫోన్‌ నుంచి ఓ స్నేహితుడికి లొకేషన్‌ షేర్‌ చేశాడు. కానీ, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు యుగేందర్‌ అందరి సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశాడు. హేమంత్‌ కాళ్లు కట్టి, నోరు, ముక్కుపై గుడ్డ పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న హేమంత్‌ గొంతు చుట్టూ గుడ్డ బిగించారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాకే మల్కాపూర్‌ శివార్లలో కిష్టాయిగూడెం సమీపంలోని పొదల్లో రాత్రి 7.30 గంటలకు మృతదేహాన్ని పడేశారు. 
20న చంపాలని ప్లాన్‌ చేశారు 
ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో ఎంత మాట్లాడించినా అవంతి మనసు మారకపోవడంతోపాటు ఆస్తి, అంతస్తుల్లో తమకన్నా కిందిస్థాయిలో ఉన్న అల్లుడు హేమంత్‌ను హతమార్చాలని ఈ నెల 20న నిర్ణయించారు. చందానగర్‌లోని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, ప్రధాన నిందితుడు, మేనమామ గూడూరు యుగేందర్‌రెడ్డిలు చర్చించుకున్నారు. దీంతో యుగేందర్‌ రెడ్డి రూ.10 లక్షల సుపారీ ఇస్తే పని అవుతుందని అక్కాబావలకు చెప్పాడు. మరుసటి రోజే ఇంటికి వచ్చిన యుగేందర్‌ రెడ్డి రూ.లక్ష అడ్వాన్స్‌గా తీసుకొని సుపారీ మాట్లాడుకున్న వట్టినాగులపల్లి వాసి బిచ్చు యాదవ్, గోపన్‌పల్లి వాసి ఎరుకల కృష్ణ, మహమ్మద్‌ పాషాకు రూ.28 వేలు ఇచ్చాడు. మిగతాది పని పూర్తికాగానే ఇస్తానని చెప్పాడు.  

రావన్‌ కోల్‌లో పట్టుబడ్డారిలా... 
రాత్రి 9.40 గంటల ప్రాంతంలో ఎరుకల కృష్ణ మధ్యలోనే వాహనం దిగిపోగా, బిచ్చుయాదవ్‌ మాత్రం యుగేందర్‌రెడ్డితో కలసి రావన్‌కోల్‌కు వెళ్లాడు. అక్కడికెళ్లాక యుగేందర్‌ రెడ్డి మళ్లీ ఫోన్‌ స్విచ్ఛాన్‌ చేయడంతో పోలీసులు ట్రేస్‌ చేసి వారిద్దరిని పట్టుకున్నారు. వారికి భోజనం సమకూర్చిన గూడూరు సందీప్‌రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో విగత జీవిగా మారిన హేమంత్‌ కుమార్‌ ఆచూకీ లభ్యమైంది. అప్పటికే దొంతి లక్ష్మారెడ్డి, అర్చన, వారి బంధువులు అర్ధం రంజిత్‌ రెడ్డి›, రాకేష్‌ రెడ్డి, రజిత, ఎల్లు సంతోష్‌ రెడ్డి, కైలా సందీప్‌రెడ్డి, అర్ధం స్పందన, ఎల్లు స్వప్న, సాహెబ్‌ పటేల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి చేతికి ఉన్న రెండు తులాల బంగారు కడియం తీసుకున్న ఎరుకల కృష్ణ, మహ్మద్‌ పాషాలు పరారీలో ఉన్నారు. అయితే అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. పోలీసులు సకాలంలో వచ్చి ఉంటే హేమంత్‌ కిడ్నాప్‌కు గురయ్యేవాడు కాదని పలువురు విమర్శిస్తున్నారు.  

ముఖంపై గాయాలు.. మెడకు తాడు బిగింపు 
ముఖంపై బలమైన పిడిగుద్దులతోపాటు మెడకు తాడు బిగించడం వల్లే హేమంత్‌ కుమార్‌ ఊపిరాడక మృతి చెందినట్లు శుక్రవారం పోస్టుమార్టం చేసిన ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్‌ డాక్టర్‌ ఝాన్సీలక్ష్మి సహా ఆరుగురు వైద్యుల బృందం గుర్తించింది. మృతదేహాన్ని చూసి తల్లి, భార్య గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించి ఫీజర్‌ బాక్స్‌లో భద్రపరిచారు.  

ఏం సాధించారు?
సొంత కూతురి పసుపు, కుంకుమలు పోగొట్టి వారు ఏం సాధించారు.. ఆ తల్లిదండ్రులు అసలు మనుషులేనా.. బిడ్డ విషయంలో ఎవరైనా ఇలా చేస్తారా.. ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు. కొద్దిరోజులు గడిస్తే అంతా సద్దుమణిగిపోతుందని భావించాం. కానీ, ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదు. గురువారం ఉదయం ఫోన్‌ చేసి అమ్మా.. దోశలు చేసిపెట్టు వస్తున్నా.. అని చెప్పాడు. ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఊహించలేదు. –రాణి, మృతుడి తల్లి 

ఉరితీయాలి.. 
తన కుమారుడు హేమంత్‌ను హత్య చేసిన వారిని, వారి వెనుక ఉన్న అవంతి తండ్రి లక్ష్మారెడ్డిని తమ కళ్లముందు ఉరితీయాలి. హేమంత్‌ అవంతిని కులాంతర వివాహం చేసుకున్నా తాము వ్యతిరేకించలేదు. అవంతిని కూడా తమ సొంత బిడ్డలాగే చూసుకున్నాం. పిల్లల ప్రేమ, ప్రాణాల కన్నా డబ్బు, కులమే ముఖ్యమా? ఇలాంటి తల్లిదండ్రులను ఎక్కడా చూడలేదు.
–మురళీకృష్ణ, మృతుడి తండ్రి  

సకాలంలో స్పందించి ఉంటే.. బతికేవారు: అవంతి
తన భర్తను హత్య చేసిన వారెవరినీ ప్రాణాలతో ఉండనీయొద్దు. ఇలాంటి పరువుహత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఎన్‌కౌంటర్‌ చేయాలి. హేమంత్‌ను చంపేస్తారని నాకు ముందే తెలిస్తే.. అంతకంటే ముందే నేనే ఆత్మహత్య చేసుకునే దాన్ని. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాననే నా తల్లిదండ్రులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. నా భర్త చావుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలి. యూఎస్‌లో ఉంటున్న నా భర్త సోదరుడు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తాం.
 హేమంత్‌ తల్లిదండ్రులు మురళీకృష్ణ, రాణి, భార్య అవంతి (మధ్యలో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement