
ఢాకా: రెండు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనాను హత్య చేసేందుకు యత్నించారన్న కేసులో 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు బంగ్లాదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. వీరిలో 9 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వీరిని ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్పించి చంపి ఇలాంటి వారికి ఒక సందేశమివ్వాలని జడ్జి తీర్పులో వ్యాఖ్యానించారు. లేదంటే వీరిని ఉరితీయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ నియమాల ప్రకారం మరణ శిక్షను హైకోర్టు నిర్ధారించాల్సి ఉంటుంది. తాజా తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఇస్తారు. 2000 సంవత్సరంలో హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్‌కు చెందిన వీరంతా ప్రధాని హత్యకు కుట్రపన్నారు. వీరి నాయకుడు ముఫ్తి అబ్దుల్ హనన్‌కు వేరే కేసులో 2017లో మరణ శిక్ష అమలు చేశారు. ప్రధాని హత్యాయత్నాన్ని సెక్యూరిటీ వర్గాలు భగ్నం చేశాయి. ఈ కేసుకు సంబంధించే గతంలో 10మంది ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం జరిగింది. 1975 నుంచి హసీనా పలుమార్లు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment