
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నారాయణ నాయక్, రికవరీ చేసిన రూ.52 లక్షలపైగా నగదు (టేబుల్ పైన)
ఏలూరు టౌన్: డబ్బుల కట్టలు చూడగానే అతడికి దుర్బుద్ధి పుట్టింది. కంచే చేను మేసిన చందంగా కాపలాదారుడిగా ఉండి తనే డబ్బును కాజేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఇంటిదొంగను గంటల వ్యవధిలోనే పట్టేసి కటకటాల వెనక్కి నెట్టేశారు. కార్మికుల కష్టాన్ని దోచేద్దామనుకుని జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె.నారాయణ నాయక్ పోలవరం ప్రాజెక్టులో జరిగిన భారీ చోరీ, సొత్తు రికవరీ వివరాలను వెల్లడించారు. గురువారం (6వ తేదీ) పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనిచేసే కార్మికులకు చెల్లించేందుకు రూ.52,26,016 కార్యాలయంలో ఉంచారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు గ్రామానికి చెందిన పుష్పగిరి మధుసూదనరెడ్డి నెలరోజుల క్రితమే సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు. పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు కూలీ చెల్లించేందుకు తెచ్చిపెట్టిన రూ.52 లక్షలకు పైగా సొమ్మును చూశాడు. అతనిలో దురాశ పుట్టింది. అంతే ఆ సొమ్ము దొంగిలించి అక్కడి నుంచి ఉడాయించాడు.
లేబర్ క్యాంపు మెస్ వద్ద మోటారు సైకిల్‌ను సైతం చోరీ చేసి దానిపై పరారయ్యాడు. డబ్బు మాయం కావటంతో అధికారులు స్పందిస్తూ పోలవరం పోలీసు స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 152/2020 యూ/ఎస్ 457 అండ్ 380 ఐపీసీగా కేసు నమోదు చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇంత భారీమొత్తంలో చోరీ జరగటంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ప్రత్యేక పర్యవేక్షణలో పోలవరం సీఐ ఏఎన్‌ఎన్ మూర్తి, ఎస్‌ఐ శ్రీనివాస్, బుట్టాయగూడెం ఎస్‌ఐ వెంకటేశ్వరరావుతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు పనిలో పరిస్థితులను ఆరా తీశారు.
దర్యాప్తును ముమ్మరం చేయటంతో మధుసూదనరెడ్డి రాజమహేంద్రవరంలో మోటారు సైకిల్‌ను విక్రయించి అక్కడి నుంచి క్యాబ్‌లో అద్దంకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాజెక్టు కార్యాలయం వద్ద పనిచేసే వారి విషయమై ఆరా తీస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నిందితుడి కదలికలను కనిపెట్టారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు నిందితుడి సొంత ఊరు ప్రాంతానికి చేరుకున్నారు. అద్దంకిలోని ఒక లాడ్జిలో ఉండగా అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను చోరీ చేసిన సొత్తులో రూ.52,20,700లను రికవరీ చేశారు. మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment