కర్కగూడెం గ్రామ సమీపంలో ఎన్‌కౌంటర్‌తో భారీ నష్టం
బీకే–ఏఎస్‌ఆర్ డివిజన్ కమిటీ దాదాపు ఏరివేసిన తెలంగాణ పోలీస్
సెంట్రల్ కమిటీ సభ్యుడు జగన్ ఎన్‌కౌంటర్ జరిగిన రోజుల వ్యవధిలోనే మరో ఆరుగురి ఎన్‌కౌంటర్
తెలంగాణ సరిహద్దులో ముప్పేట దాడి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఎన్‌కౌంటర్లలో మృతి చెందడం, మరోవైపు మావోయిస్టుల కీలక ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు పట్టుసాధిస్తుండటం మావోయిస్టులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం దంతెవాడ–బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు తొలితరం అగ్రనాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్‌కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న, అలియాస్ విజయ్, అలియాస్ శంకర్‌రావు హతమైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం రఘునాథపాలెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. \
దళం తుడిచిపెట్టుకుపోయినట్లే...
కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పాట్రో టీంకు తారసపడిన బీఏ–ఏఎస్‌ఆర్ డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, లచ్చన్న సతీమణి తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో తెలుగు ప్రాంతాల్లో మావోయిస్టులకు చెందిన అత్యంత కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే–ఏఎస్‌ఆర్) దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లయింది. ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దులోపల ఇదే భారీ ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. ఇదే డివిజన్ కమిటీకి చెందిన మరో మావోయిస్టు విజయేందర్‌ను సైతం పోలీసులు ఈ ఏడాది జూలైలో గుండాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.ఇలా దెబ్బమీదదెబ్బతో బీకే–ఏఎస్‌ఆర్ డివిజన్‌కు తీవ్ర నష్టం జరిగింది.
క్రమంగా పట్టుసాధిస్తున్న పోలీసులు..
మరోవైపు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు అత్యంత పట్టుఉన్న ప్రాంతాల్లోనూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, స్థానిక పోలీస్ బలగాలు చొచ్చుకుపోతున్నాయ. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోనూ వరుస ఎన్‌కౌంటర్లలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు తెలంగాణ నుంచి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రంలోకి అడుగుపెడుతుండగా హతమార్చారు.
ఈ ఏడాది జూన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లోనూ 8 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. ఇలా వరుస దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చత్తీస్‌గఢ్ వైపు ఒత్తిడి పెరగడంతో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయతి్నస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలను తెలంగాణ గ్రేహౌండ్స్, టీజీఎస్పీ, స్థానిక పోలీసు బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. మావోయిస్టులు తెలంగాణ వైపు రాకుండా ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తూ వారిని అడ్డుకుంటున్నాయి. ఏ మాత్రం సమాచారం దొరికినా వెంటనే బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. అయితే, తాజాగా గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment