అభిలాష్ (ఫైల్)
సాక్షి, భువనగిరి: మమ్మీ బైబై.. అంటూ స్కూల్‌కు వెళ్లిన చిన్నారి కానిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని హైదర్‌పూర్ గ్రామానికి చెందిన వడ్డేమోని శ్రీనివాస్, రాణి దంపతులకు మల్లికార్జున్, అభిలాష్(8) ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె వర్షిత ఉన్నారు.
వీరంతా మండల కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్‌లో చదువుతున్నారు. మల్లికార్జున్ 5వ తరగతి, అభిలాష్ ఒకట తరగతి, వర్షిత ఎల్‌కేజీ చదువుతుంది. ఉదయం అందరూ రెడీ అయి స్కూల్‌కు వెళ్లారు. ఒంటిపూట బడులు కావడంతో స్కూల్ వదిలిన తరువాత తిరిగి స్కూల్ బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరారు.
వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి జారి..
స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు.. ఆయా గ్రామాలలో పిల్లలను దింపుతూ చివరగా హైదర్‌పూర్‌కు వెళ్తుంది. బస్సులో 10 మంది వరకు విద్యార్థులున్నారు. ఈ క్రమంలో భీమనపల్లి గ్రామం దాటిన తరువాత బస్సు డ్రైవర్ జింకల రాము అతివేగంగా బస్సును నడిపాడు. గ్రామశివారులోని చెరువు దాటిన తరువాత మూలమలుపు వద్ద కుదుపునకు బస్సులో ఉన్న అభిలాష్ కదులుతున్న బస్సులోంచి జారి కింద పడగా, బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లింది.
విద్యార్థి బస్సులోంచి పడిపోయిన విషయాన్ని డ్రైవర్ కనీసం చూడకుండానే వేగంగా అలానే ముందుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో భీమనపల్లి గ్రామానికి చెందిన ముంత కృష్ణ అనే వ్యక్తి బైక్‌పై వస్తూ విద్యార్థి కిందపడిపోవడాన్ని గమనించి కొద్దిదూరం వెళ్లిన బస్సును ఆపాడు. అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూడగా అభిలాష్ రక్తపుమడుగులో విగతజీవిగా మారాడు.
బస్సు డోర్‌కు లాక్ ఉండి ఉంటే...
స్కూల్ బస్సు డోర్‌కు లాక్ సరిగా లేని కారణంగా బస్సులో ఉన్న వృద్ధురాలైన ఆయా పోశమ్మ డోర్ లాక్ వేయలేదు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును వేగంగా నడపడం వల్ల నిండుప్రాణం బలైపోయింది. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి గుండెవిసేలా రోదించారు.
సమాచారం అందుకొన్న ఎస్‌ఐ సైదిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ రామును అదుపులోకి తీసుకొన్నారు. అలాగే బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు
లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన బస్సు నుంచి అభిలాష్(6) అనే విద్యార్థి కిందిపడి మృతిచెందిన విషయంపై ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు భువనగిరి డీఈవో కె నారాయణరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment