విశాఖపట్నం: తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. పాఠశాలకు వెళ్తూ తల్లి కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందిన సంఘటన ఉక్కునగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక డీపాల్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్న పెరుమాళ్ల ఎలీజా సేవారిన్ (9) తల్లితో కలిసి శనివాడలో నివసిస్తున్నాడు. తండ్రి ఎలై సేవారిన్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా తల్లి సౌజన్యతో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం తల్లి సౌజన్య కుమారుడిని తీసుకుని స్కూటీపై స్కూల్‌కు బయల్దేరారు. సరిగ్గా డీపాల్ పాఠశాల కూడలి వద్దకు వచ్చేసరికి మలుపు తిరుగుతున్న స్కూటీని ఫార్మా కంపెనీకి చెందిన బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎలీజా సేవారిన్ కింద పడిపోవడంతో బస్సు బాలుడి తలపై నుంచి దూసుకుపోయింది. దీంతో చిన్నారి తల భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతిచెందాడు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో తల్లి సౌజన్య షాక్‌కు గురైంది. అప్పటి వరకూ తనతోనే ఉన్న కుమారుడు విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది.
న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయింపు
ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బస్సు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో డ్రైవర్, అందులోని ఫార్మా ఉద్యోగులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఉక్కునగరం పోలీసులు ఘటనా స్థలికి భారీగా చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ఫార్మా బస్సులు ఈ మార్గంలో ప్రయాణించరాదని, ప్రమాదానికి కారణమైన ట్రాన్స్‌ఫోర్టు సంస్థ యజమాని రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాఠశాల విద్యార్థి మృతి చెంది బయట ఉద్రిక్తతగా ఉండగా తరగతులు నిర్వహించడంపై యాజమాన్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక డీసీపీ ఆనందరెడ్డి, ఏసీపీ టి.త్రినాథ్, స్టీల్‌ప్లాంట్, దువ్వాడ, గాజువాక సీఐలు, ఎస్‌ఐలు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నంచారు.
అనంతరం టౌన్ అడ్మిన్ విభాగంలో ఉక్కు యాజమాన్యం ప్రతినిధులు చర్చలు జరిపారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, బయ్యే మల్లయ్య, ఎస్.మోహన్‌బాబు జరిపిన చర్చల్లో మృతుని కుటుంబీకులకు డీపాల్ పాఠశాల యాజమాన్యం రూ. 5 లక్షలు, ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యం రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. ఫార్మా కంపెనీ చిన్న స్థాయి అధికారులు రూ.లక్ష ఇస్తామని చెప్పగా ఎమ్మెల్యే నాగిరెడ్డి తిరస్కరించి రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. వారి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అనంతరం స్టీల్‌ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు
తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment