సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు రెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌వేసి.. అమలు చేశారు. తలనొప్పిగా మారిన న్యాయవాది వామన్‌రావును హతమార్చాలని ఎప్పటి నుంచో మాజీ ఎంపీటీసీ కుంట శ్రీనివాస్ ఎదురుచూస్తున్నాడు. అయితే కుంట శ్రీనుకు 2 గంటల్లోనే పూర్తి సహకారం అందించి ‘కథ’ముగించింది మాత్రం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను. ఈ నెల 17న ఉదయం 11.30 గంటల తర్వాత న్యాయవాద దంపతులు మంథని కోర్టుకు వచ్చి మధ్యాహ్నం 1.30–2 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 2.30 గంటల ప్రాంతంలో రామగిరి మండలం కల్వచర్ల వద్ద దాడి జరిగింది. వామన్‌రావు దంపతులు కోర్టుకు వచ్చిన తర్వాతే మర్డర్ ప్లాన్ జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వామన్‌రావు కోర్టులో ఉన్నంత సేపు అతడి కదలికలను ఎప్పటికప్పుడు నిందితుడు కుంట శ్రీనివాస్‌కు చేరవేయగా, బిట్టు శ్రీనుతో కలసి ఎక్కడ చంపాలనే విషయమై ప్లాన్ చేసి, అమలు చేశారు.
కోర్టు దగ్గర రోజూ రెక్కీ
తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడని, మంథనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధును ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే కసితో వామన్‌రావును హతమార్చాలని కుంట శ్రీనివాస్ కొంతకాలంగా వేచి చూస్తున్నాడు. గుంజపడుగులో గుడి వివాదం పెరగడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వస్తాడనే ఉద్దేశంతో వారం నుంచి కోర్టు వద్ద రోజుకో మనిషిని ఉంచుతున్నాడు. అందులో భాగంగానే బుధవారం కూడా తన మనిషిని కోర్టు వద్ద ఉంచగా, వామన్‌రావు దంపతులు వచ్చిన విషయాన్ని 12.30 గంటల సమయంలో కుంట శ్రీనివాస్‌కు చేరవేసినట్లు తెలిసింది. అప్పటికే సీఎం జన్మదిన వేడుకల్లో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో పాటు పలు గ్రామాల్లో పాల్గొన్న శ్రీనివాస్ మంథనికి చేరుకున్నాడు. వామన్‌రావు వచ్చిన విషయం తెలిసిన వెంటనే మధు మేనల్లుడు.. బిట్టు శ్రీనును కలిసినట్లు తెలుస్తోంది.
వామనరావును చంపేందుకు అనువైన స్పాట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. వామన్‌రావు గుంజపడుగుకు వెళ్తే చంపాల్సిన స్పాట్‌తో పాటు హైదరాబాద్ వెళ్తే ఎక్కడ ప్రాణాలు తీయాలో స్కెచ్ వేశారు. బిట్టు శ్రీనుకు చెందిన నల్ల కారును హత్య కోసం వాడుకోవాలని నిర్ణయించుకుని, డ్రైవర్‌గా వీరికి నమ్మకస్తుడైన చిరంజీవిని పిలిపించారు. బిట్టు శ్రీనునే మంథనిలో కొడవళ్లు, కత్తులు అమ్మే దగ్గర రెండు కత్తులు కొని కారులో పెట్టాడు. మూడో నిందితుడు అక్కపాక కుమార్‌ను పిలిపించి తెల్ల కారును ఇచ్చి కోర్టు దగ్గర రెక్కీ కోసం పంపారు. మంథని చౌరస్తాలో నల్లకారుతో కుంట శ్రీనివాస్, చిరంజీవి వేచి ఉన్నారు. 2 గంటల సమయంలో వామనరావు కారు హైదరాబాద్‌కు బయల్దేరుతుందన్న సమాచారం కుమార్ నుంచి రాగానే కల్వచర్ల స్పాట్‌కు వెళ్లి కారు నిలుపుకొన్నారు. వామన్‌రావు కారు రాగానే నల్లకారు అడ్డుగా పెట్టి నరికేశారు.
సాక్ష్యం ఉండకూడదనే నాగమణి హత్య
వామన్‌రావును చంపాలనే కుంట శ్రీనివాస్ ప్లాన్ వేసినా.. కారులో నాగమణి కూడా ఉండటంతో సాక్ష్యం ఉండకూడదనే ఉద్దేశంతో ఆమెను కూడా హతమార్చినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపినట్లు సమాచారం. వామన్‌రావు కారు దిగగానే కుంట శ్రీనివాస్ ఎదురుగా దూసుకెళ్లగా, చిరంజీవి మాత్రం నాగమణి కూర్చున్న వెనుక సీటు వైపు వెళ్లి మెడపై ఒక్క వేటు వేసినట్లు సమాచారం. నాగమణి చనిపోగానే చిరంజీవి కూడా రోడ్డు మీదకు వచ్చి వామన్‌రావుపై దాడి చేశారు. మెడపై, కడుపులో గాయాలతో వామన్‌రావు చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉంది.
చదవండి: (మాయమైపోతున్న మనిషి!)
బిట్టు శ్రీను అరెస్టు
నాలుగో నిందితుడైన పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గురువారం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కేస్ రీకన్‌స్ట్రక్షన్ కోసం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్‌రావు ముందు నిందితులను హాజరుపరిచినట్లు సమాచారం.
బిట్టు శ్రీనుతో మారిన సీన్
హత్య జరిగిన రోజు వచ్చిన వీడియోలో వామన్‌రావును కుంట శ్రీనివాస్‌తో కలసి కుమార్ చంపినట్లు భావించారు. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ కూడా ‘సాక్షి’తో చెప్పారు. అయితే కుంట శ్రీనివాస్‌ను విచారించిన తర్వాత బిట్టు శ్రీను ప్రమేయం వెలుగులోకి రావడం, డ్రైవర్ చిరంజీవితో కలసి హత్య చేసినట్లు పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. వామన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకే తొలుత ఎఫ్‌ఐఆర్‌లో వసంతరావు, కుంట శ్రీనివాస్, కుమార్‌లను నిందితులుగా చూపించామని, ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ చెప్పిన మాటలతో ఎఫ్‌ఐఆర్‌లో చిరంజీవిని, బిట్టు శ్రీనును చేర్చినట్లు శుక్రవారం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వివరించారు.
పుట్ట మధుకు చుట్టుకుంటోందా?
జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ స్వయాన మేనల్లుడు అయిన బిట్టు శ్రీనును శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మధు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు మంథని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేనల్లుడు శ్రీను.. పుట్ట మ«ధుకు చేదోడు వాదోడుగా ఉంటూ పుట్ట లింగమ్మ ట్రస్టు వ్యవహారాలతో పాటు ఆయన కుటుంబంలో కీలకసభ్యుడిగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు గ్రామ కక్షలుగా పరిగణించిన పోలీసులు కుంట శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో రాజకీయ కోణంపై దృష్టి సారించి.. బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకోవడంతో కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం న్యాయవాదుల హత్యలపై సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.
జంట హత్యల విషయంలో ప్రతిపక్షాలు దాడి ముమ్మరం చేసిన నేపథ్యంలో వివరాలను సీఎం కేసీఆర్.. డీజీపీని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కాగా, మామ పుట్ట మధుకర్‌కు తెలియకుండా బిట్టు శ్రీను ఏ పనీ చేయడన్న పేరుంది. అలాంటప్పుడు పోలీసు విచారణలో బిట్టు శ్రీను పేరు తెరపైకి రావడం.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మధు చుట్టూ హత్య కేసు ఉచ్చు చుట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
చదవండి: (కారు, కత్తులు సమకూర్చింది అతడే..)
వీడియో తీసినవారి కోసం ఆరా
న్యాయవాద దంపతుల హత్యకు రెండు వీడియోలు పోలీసులకు కీలకంగా మారడంతో ఆ వీడియోలు చిత్రీకరించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడి చేసిన అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న వామన్‌రావును ఓ వ్యక్తి పలకరించగా మొదట పుట్ట మధు పేరు చెప్పి అటు తర్వాత కుంట శ్రీనివాస్ పేరు.. గ్రామం పేరు చెప్పినట్లు వీడియోలో ఉంది. వామన్‌రావు మరణ వాంగ్మూలంగా పోలీసులు ఆ రికార్డును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా రికార్డులో పుట్ట మధు పేరు వినిపిస్తుండటంతో ఆ రికార్డుపై పోలీసులు దృష్టి సారించారు. ఇంకేమైనా వీడియోలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment