సాక్షి,ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇంటిముందు అనుమానాస్పద వాహనం రేపిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈకేసులో తాజాగా మరో కీలక విషయాన్ని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేతో కలిసి ఉన్న వీడియోను గుర్తించినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రకటించాయి. (అంబానీ ఇంటివద్ద కలకలం : బతికుండగానే నీటిలో )
ఫిబ్రవరి 17న వీరిదద్దరూ కలిసి ఉన్నట్లు వెల్లడించే వీడియో ఫుటేజీని కనుగొన్నామని విచారణ అధికారులు తెలిపారు. ఫుటేజ్ ప్రకారం హిరేన్‌కు చెందిన నల్ల మెర్సిడెస్ బెంజ్ కారులో వాజేను కలుసుకున్నారు. వీరి సమావేశం సుమారు 10 నిమిషాల పాటు కొనసాగింది. వీడియోలో, వాజే ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని బెంజ్ కారులో వెళ్ళడాన్ని గమనించవచ్చని ఏటీఎస్ తెలిపింది. ఈ సందర‍్భంగా హిరేన్ స్కార్పియో కారు తాళాలను వాజేకు అప్పగించి ఉంటాడని కూడా ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న, హిరేన్ తన స్కార్పియో చోరికి గురైందని విఖ్రోలి పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 25 న బెదిరింపులేఖతోపాటు జెలిటిన్ స్టిక్స్ ఉన్న అదే స్కార్పియోను అంబానీ నివాసం యాంటిలియా వెలుపల కనుగొన్నారు. ప్రస్తుతం వాజే వాడుతున్న బ్లాక్ బెంజ్ కారును ఇటీవల ఏటీఎస్ సీజ్ చేసింది.
తాజా పరిణామంతో హిరేన్ మృతిలో వాజే పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అలాగే వాజేకు చెందిన మూడు ప్రధాన వ్యాపార సంస్థలపై నిఘాపెట్టాయి. వాజ్ డైరెక్టర్‌గా పనిచేసిన డిజీ నెక్స్ట్ మల్టీ మీడియా లిమిటెడ్, మల్టీ-బిల్డ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్, టెక్లీగల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఆరా తీస్తున్నాయి. ఈ సంస్థలలో ఇతర డైరెక్టర్ల పాత్రను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు థానే సెషన్స్ కోర్టులో వాజే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌కు ఏటీఎస్ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ మార్చి 30 కి వాయిదా పడింది.
కాగా ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలు కలకలం రేపాయి. ఇందులోని ఒకవాహనం స్కార్పియో వాహనం యజమాని హిరేన్ మార్చి 5 న ముంబై సమీపంలోని ఒక కొలనులో శవమై తేలాడు. అయితే ఈ కారును సచిన్ వాజే నాలుగు నెలలు ఉపయోగించారని, ఫిబ్రవరి 5న తిరిగి ఇచ్చారని హిరేన్ భార్య విమల ఆరోపించారు. తన భర్త మరణంలో వాజ్ పాత్ర ఉందని కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మూడు కేసులను ఎన్‌ఐఏ, ఏటీఎస్ విచారిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment