బెంగళూరు: అంబులెన్స్ డ్రైవర్లు. రోగులను సమయానికి ఆస్పత్రులకు తరలించడం వారి విధి. అంతేకాదు తప్పనిసరి పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి నిండు ప్రాణాల్ని కాపాడతారనే మంచి పేరుంది. కానీ ఈ కరోనా కష్టకాలంలో పలువురు అంబులెన్స్ డ్రైవర్లు సంపాదనే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదనే కారణంతో కరోనా పేషెంట్లను, వారి డెడ్ బాడీలను మార్గం మద్యలో వదిలేసి పారిపోతున్నారు.
బెంగళూరులోని తుమకూరుకు చెందిన శరత్(26) అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా విలయ తాండవాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కరోనా పేషెంట్లను, డెడ్ బాడీలను స్మశాన వాటికి తరలిస్తుండే వాడు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ శరత్ కరోనాతో మరణించిన బాధితుడి డెడ్ బాడీని హెబ్బాల్ సమీపంలోని ఓ ఫుట్ పాత్పై వదిలేసి పారిపోయాడు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అమృత హళ్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో శరత్ కరోనా బాధితులను, డెడ్ బాడీలను ఇలాగే గతంలో మార్గం మద్యలోనే వదిలేసినట్లు తేలింది. ఇక హెబ్బాల్ సమీపంలో కరోనాతో మరణించిన బాధితుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించేందుకు అతని కుటుంబ సభ్యులతో రూ.3వేలకు మాట్లాడుకున్నాడు. కానీ హెబ్బాల్ సమీపంలోకి రాగానే శరత్కు దుర్బుద్ధి పుట్టింది. బాధితుల రోధనల్ని క్యాష్ చేసుకునేందుకు కుట్రకు పాల్పడ్డాడు. డెడ్ బాడీని తరలించాలంటే రూ.3వేలు కాదు ఇంకో 18వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.దీంతో ఆందోళనకు గురైన మృతుడి భార్య తాను అంత ఇవ్వలేనని, ముందుగా మాట్లాడుకున్నంత ఇస్తానని వేడుకుంది. అయినా సరే డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. పాపం చివరికి అడిగినంత డబ్బులు ఇవ్వులేదని కారణం చూపుతూ మృతుడి డెడ్ బాడీని పుట్ పాత్ పై వదిలేసి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment