సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (ఏఎస్పీ) పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన చీటింగ్ కేసుపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మరో నిందితుడైన విశాఖపట్నం వాసి మణిధర్ వర్మను అరెస్టు చేయగలిగారు. బాధితుడిని మోసం చేయడానికి డీఎస్పీ అవతారమెత్తిన కడపకు చెందిన కేవీ రాజు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో ముని రామయ్యకు నిందితుడిగా నోటీసులు జారీ చేయగా... ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఏపీ పోలీసుల ఆయనపై చర్యలు తీసుకున్న విషయం విదితమే. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన స్నేహితుడైన జయప్రతాప్.. చిత్తూరు జిల్లా ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే ఆయన వివిధ పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్ల తిరిగి ఇస్తాడని చెప్పాడు.
చదవండి: రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం.. కబ్జాపై ‘ఎస్‌ఓటీ’
ఈ మాటలను సునీల్‌కుమార్ పట్టించుకోకపోవడంతో మరోసారి మునిరామయ్యను తీసుకుని హైదరాబాద్ వచ్చారు. హిమాయత్‌నగర్‌లోని సునీల్ కుమార్ కార్యాలయానికి వెళ్లి తాము చెప్పినట్లు చేస్తే కచ్చితంగా లాభం వస్తుందని, రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ నమ్మబలికారు. అంతటితో ఆగని ముని రామయ్య టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ అంటూ కేవీ రాజు అనే వ్యక్తిని రంగంలోకి దింపాడు. ఈ వ్యవహారంలో మణిధర్ వర్మ మధ్యవర్తిత్వం వహించాడు. వీరందరు సునీల్ నుంచి 2019 నవంబర్‌లో రూ.1.2 కోట్లు వసూలు చేశారు.
ఇది జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా ఎదురు చూసినా సునీల్‌కుమార్‌కు డబ్బు తిరిగి రాలేదు. ఆయన ఆరా తీయగా కేవీ రాజు అనే పేరుతో డీఎస్పీ లేరని, జరిగింది మోసమని గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేసి నేరం జరిగినట్లు నిర్థారించారు. ముని రామయ్యతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మణిధర్ వర్మను అరెస్టు చేశారు. సూడో డీఎస్పీ కేవీ రాజును పట్టుకుని విచారిస్తే ఈ కేసులో కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోసం నగరంతో పాటు ఏపీలోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment