ముంబై: నిషేధిత మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్‌కు బుధవారం కూడా బెయిల్ దొరకలేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రత్యేక కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది. తాజాగా ఈ రోజు కూడా బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ అమిత్ దేశాయ్, ఆర్యన్‌కు వ్యతిరేకంగా అదనపు సొలిసిటరల్ జనరల్ అనిల్ సింగ్ పోటాపోటీగా వాదనలు వినిపించారు.
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అమిత్ దేశాయ్ గంటన్నర పాటు కోర్టులో వాదించారు. ‘డ్రగ్స్ కొనడానికి ఆర్యన్ దగ్గర డబ్బులు లేవు. విక్రయించడానికి కానీ సేవించడానికి కానీ అతడి దగ్గర డ్రగ్స్ లేవు. అలాంటప్పుడు అతడిని ఎందుకు ఇందులో ఇరికించారు? బెయిల్ పిటిషన్‌కు ఎన్‌సీబీ ఇచ్చిన సమాధానంలో కొత్తదనం ఏమీ లేదు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే నా క్లయింట్స్ మాదకద్రవ్యాల విక్రేతలు కాదు. ఇప్పటికే వారు తగినంత బాధ అనుభవించార’ని అమిత్ దేశాయ్ పేర్కొన్నారు.
ఆర్యన్ ఖాన్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. దేశం మొత్తం నిషేధిత మాదకద్రవ్యాల వాడకం గురించి ఆందోళన చెందుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తి సంబంధించిన విషయం కాదు. డ్రగ్స్ దందాను నడిపిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఎన్‌సీబీ పనిచేస్తోంది. ఈ కేసులో నిందితులను విడుదల చేస్తే దర్యాప్తు కుంటుపడే అవకాశముంది. విదేశీయుడొకరితో వాణిజ్య పరిమాణంలో హార్డ్ డ్రగ్స్ గురించి ఆర్యన్ ఖాన్ చాట్ చేసినట్టు ఎన్‌సీబీ గుర్తించింది. ఈ సంభాషణలు ముంబై క్రూయిజ్ కేసుకు సంబంధించినవి కాదా అనేది గుర్తించాల్సి ఉంద’ని అనిల్ సింగ్ అన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. బెయిల్ రాకపోవడంతో ఆర్యన్ ఖాన్ ఈరోజు కూడా జైలులో గడపాల్సి ఉంటుంది. కాగా, ఈనెల 2న అతడిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే శిక్ష ఎన్నేళ్లంటే..?)
Comments
Please login to add a commentAdd a comment