వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా దాడులు
తాజాగా విలేకరి ఇల్లు కూల్చివేసిన టీడీపీ నేతలు
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.
అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి.
విలేకరి ఇల్లు కూల్చివేత
చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.
టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్‌సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు.
తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment