బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం  | Auto Driver Molested Pharmacy Student At Ghatkesar | Sakshi
Sakshi News home page

బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం 

Published Thu, Feb 11 2021 1:26 AM | Last Updated on Thu, Feb 11 2021 5:50 AM

Auto Driver Molested Pharmacy Student At Ghatkesar - Sakshi

సాక్షి, ఘట్‌కేసర్‌: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌ ఓయూ కాలనీకి చెందిన యువతి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. అయితే కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు.

అప్పుడు బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్‌.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా డ్రైవర్‌ ముందుకు తీసుకెళ్లాడు. యామన్నపేట వద్ద ఇంకో వ్యాన్‌ ఉండగా, ఆటోలో నుంచి ఆమెను బలవంతంగా అందులోకి ఎక్కించారు. అక్కడి నుంచి వ్యాన్‌లో ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లి ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల సైరన్‌ విన్పించడంతో ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అప్పటికీ పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. 

డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో.. 
తను దిగాల్సిన చోట ఆపకుండా ఆటోను తీసుకెళ్తున్న సమయంలోనే బాధితురాలు తన తల్లికి ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి తమ సమీప బంధువైన ఓ అబ్బాయికి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ వెంటనే అతడు డయల్‌ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేశాడు. అప్పటికప్పుడు కీసర, ఘట్‌కేసర్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేయడంతో చివరికి ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు. 

బాధితురాలి కుడి కాలికి గాయం.. 
ఆటో డ్రైవర్‌తో జరిగిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయమైంది. అలాగే కొంతమేర ఆమె దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఎట్టకేలకు రాత్రి 7.50 ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే జోడిమెట్లలోని క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యాం ప్రసాద్‌కుమార్‌ ఆస్పత్రికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. అయితే ఆటోడ్రైవర్‌ను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement