బాధితురాలు దీపా సింగ్ (పాత చిత్రం)
మంచిని మెదడుకి ఎక్కించుకోవడం మనిషికి కొంచెం కష్టమైన పనే. తెలిసీ తెలియని వయసులో కలిగిన ఆకర్షణను అర్థం చేసుకున్న ఆ పెద్దలు.. ముందు వాళ్లకు బాధ్యతలు గుర్తు చేద్దామనుకున్నారు. కొన్నాళ్లు ఆగాలంటూ ఇద్దరికీ సర్దిచెప్పబోయారు. అమ్మాయి అర్థం చేసుకుంది. కానీ, ఆ అబ్బాయే మూర్ఖంగా ఆలోచించాడు. ఫలితమే.. ఊహించని ఘోరం జరిగింది.
లైఫ్‌లో సెటిల్ కాగానే పెళ్లి చేస్తామని హామీ ఇచ్చిన పెద్దల మాటల్ని ఆ యువకుడు నమ్మలేదు. ప్రేమించిన అమ్మాయిని.. వెంటనే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడిని ఆమె తట్టుకోలేకపోయింది. ప్రియుడిని తిట్టిపోసింది. ఇగో దెబ్బ తిన్న ఆ ప్రియుడు.. కత్తితో ప్రియురాలిని కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
దీపా సింగ్, రింకూ ఇద్దరికీ ఎనిమిదేళ్ల పరిచయం. స్కూల్‌డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. బుధవారం పెద్దలను తీసుకుని దీప(20) ఇంటికి వెళ్లి మాట్లాడాడు రింకూ. అయితే డిగ్రీనే చదువుతుండడంతో దీప వాళ్ల ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. ఇద్దర్ని ముందు చదువులు పూర్తి చేయమని, జాబ్‌ల్లో సెటిల్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేస్తామని మాటిచ్చారు. దీప అందుకు అంగీకరించింది. అయితే రింకూ మాత్రం అన్యమనస్కంగా తలూపాడు.
గురువారం గురుద్వారా మార్కెట్‌కు వెళ్లిన దీపను రింకూ ఆటకాయించాడు. ఇప్పుడే పారిపోయి పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. కోపంతో ఆమె అతన్ని తిట్టిపోసింది. అది తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి కత్తి తెచ్చుకున్నాడు. ఆమె గొంతు కోసి, ఇష్టమొచ్చినట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డాడు.రక్తపు మడుగులో ఉన్న దీపను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది.
ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన రింకూ.. నేరుగా బాగ్‌పట్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తొలుత ఇది ప్రేమోన్మాది పని అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇద్దరూ ఇష్టపడ్డారని, పెద్దలు పెళ్లికి అంగీకరించారని, అయితే పెళ్లి వాయిదా పేరుతో తనని దీపకు దూరం చేస్తారనే ఆలోచనతోనే నిందితుడు రింకూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
ప్రైవేట్ కాలేజీలో అటెండర్‌గా పని చేస్తున్న దీప తండ్రి నైన్ సింగ్.. కూతురు జాబ్ చేసి కొన్నాళ్లు తమను పోషిస్తుందని, ఆపై ఇష్టపడ్డ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాట. కానీ, రింకూ ఆవేశంతో.. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment