
మృతురాలు జె.సంగీత
సాక్షి, బంజారాహిల్స్: పీఎఫ్ డబ్బు ఇప్పించడం లేదనే ఆవేదనతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్‌లోని సైదప్ప బస్తీలో నివసించే జె.సంగీత(45) సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదేళ్లుగా హౌస్‌కీపింగ్ విభాగంలో పని చేస్తుంది. ఇటీవల ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారు.
రోజూ ఆఫీస్‌కు వెళ్లి తన పీఎఫ్ డబ్బులు అడుగుతుండగా హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్ ప్రవీణ్ కుమార్ పట్టించుకోకపోగా సమాధానం సైతం ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.