
బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ రేఖా కదిరేశ్ దంపతుల ఫైల్ ఫోటో
బనశంకరి: ఆపదలో ఆదుకోవాల్సిన రక్త సంబంధీకులే అంతమొందించారు. కాటన్‌పేట పీఎస్ పరిధిలో బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ రేఖా కదిరేశ్ (45) పట్టపగలే హత్య కేసులో ఆమె సోదరి మాలా, ఇతర కుటుంబ సభ్యులే సూత్రధారులని పశ్చిమ విభాగ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మాలా, ఈమె కోడలు పూర్ణిమాను పోలీసులు అజ్ఞాత స్థలంలో తీవ్రంగా విచారించగా, తామే చేయించినట్లు ఒప్పుకున్నారని సమాచారం. ఈ హత్యలో స్టీఫెన్ ప్రముఖ పాత్రధారిగా ఉన్నాడు. రేఖాను ఎలా హత్య చేయాలి, ఎవరెవరు పాల్గొనాలి, తరువాత ఎలా పరారు కావాలి అనే ప్లాన్‌ను స్టీఫెన్ రూపొందించాడు.
రోడ్డుపక్కకు లాక్కెళ్లి
24వ తేదీ ఉదయం ఫ్లవర్ గార్డెన్ బీజేపీ ఆఫీసు వద్ద ఆమె పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసి వస్తుండగా పీటర్, సూర్య రోడ్డు పక్కకు లాక్కెళ్లి చాకుతో రేఖా గొంతు, వీపుపై విచ్చలవిడిగా పొడిచారు. స్టీఫెన్, అజయ్‌లు ఎవరూ అడ్డురాకుండ నిలబడ్డారు. ఒక యువకుడు ఆమె దగ్గరికి వస్తుండగా నిందితులు అతన్ని పెద్ద పాత్రతో తరిమికొట్టారు. ఈ హత్యోదంతం మొబైల్స్ వీడియోలు చూపరులను వణికించేలా ఉన్నాయి.
రాజకీయ, ఆర్థిక అడ్డంకి అని..
సోదరి మాలాను ఆర్థిక, రాజకీయ కారణాలే హత్యకు ప్రేరేపించాయి. రానున్న బీబీఎంపీ ఎన్నికల్లో తన కుమారుడు లేదా కుమార్తె ను బరిలోకి దింపాలని మాలా సన్నాహాలు చేసింది. ఇందుకు రేఖా ససేమిరా అంది. స్థానికంగా టెండర్లు, ఆర్థిక వ్యవహారాల్లోనూ రేఖది పైచేయి అయ్యింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించారు. ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? అని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
చదవండి: హత్యకు ఆరు నెలలుగా కుట్ర .. గతంలో భర్త.. ఇప్పుడు భార్య!
Comments
Please login to add a commentAdd a comment