ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: కటక్ జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్ షేక్ హైదర్ కోసం గాలిస్తున్న ఒడిస్సా పోలీసులు సిటీకి చేరుకున్న 48 గంటల్లోనే వేరే హత్యకేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన మరో బృందం హైదరాబాద్‌కు వచ్చింది. తమ పరిధిలో ఈ నెల 4న చోటు చేసుకున్న దారుణ హత్యకు నగరానికి చెందిన సూత్రధారి కీలకమని తేలడంతో ఈ బృందం గాలిస్తోంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఆ వ్యాపారి పేరును మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
♦ కర్ణాటకలోని బీదర్‌కు చెందిన వివేకానంద బతుకుతెరువు కోసం బెంగళూరుకు వలసవెళ్లాడు. అక్కడ సహకార్‌నగర్‌లో తన సోదరుడు సురేష్ నిర్వహిస్తున్న కన్‌స్ట్రక్షన్ సంస్థలో పని చేస్తున్నాడు.
♦ హైదరాబాద్‌కు ఓ వ్యాపారితో ఏడాది క్రితం సురేష్‌కు పరిచయం ఏర్పడింది. తన సంస్థకు కొన్ని ప్రాజెక్టులు ఇప్పించేలా, దాని నిమిత్తం 5 శాతం కమీషన్‌గా చెల్లించేలా వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
♦ దీని ప్రకారం నగర వ్యాపారి గత ఏడాది సురేష్ సంస్థకు ఓ ప్రాజెక్టు ఇప్పించాడు. దానికి కొనసాగింపుగా అతడు మరో ప్రాజెక్టు పొందాడు. అయితే మొదటి దానికే తనకు కమీషన్ ఇచ్చావని, రెండో దానికి ఇవ్వలేదని నగర వ్యాపారి వాదిస్తున్నాడు.
♦ ఆ రెండో ప్రాజెక్టు తనను తానుగా తెచ్చుకున్న నేపథ్యంలో కమీషన్ చెల్లింపు సాధ్యం కాదని సురేష్ స్పష్టం చేశాడు. దీంతో వీరి మధ్య ఏర్పడిన విభేదాలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే సురేష్‌కు నగర వ్యాపారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి.
♦ ఇదిలా ఉండగా ఈ నెల 4న వివేకానంద, సురేష్ సహకార్‌నగర్‌లోని తమ కార్యాయంలో ఉండగా ఆరుగురు వ్యక్తులు ఓ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. నగర వ్యాపారికి ఇవ్వాల్సిన డబ్బు విషయం మాట్లాడుతూ హఠాత్తుగా కత్తులతో దాడికి దిగారు.
♦ ఈ ఉదంతంలో వివేకానంద ప్రాణాలు కోల్పోగా... సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. తన సోదరుడి హత్య, తనపై హత్యాయత్నం జరగడానికి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారితో ఉన్న విభేదాలే కారణమని అక్కడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సురేష్ పేర్కొన్నారు.
♦ దీని ఆధారంగా కేసు నమోదు చేసిన సహకార్‌నగర్ పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం హంతకులు వినియోగించిన వాహనానికి నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించారు. దీంతో పాటు ఇతర ఆధారాలను బట్టి వాళ్లు కూడా హైదరాబాద్‌కు చెందిన వారేనని అనుమానిస్తున్నారు.
♦ ఆ హంతకులతో పాటు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం సోమవారం సిటీకి చేరుకుంది. ప్రస్తుతం సదరు వ్యాపారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును మాత్రం బెంగళూరు అధికారులు బయటపెట్టట్లేదు. అరెస్టు తర్వాతే వివరాలు వెల్లడిస్తామంటున్నారు.
చదవండి: జంటహత్యల నిందితునిపై తూటా
Comments
Please login to add a commentAdd a comment