బెంగళూరు : హలో సార్..! మేం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఆధార్ కార్డ్‌తో మనీ లాండరింగ్, ఆధార్ కార్డ్‌కు జత చేసిన సిమ్‌ను తప్పుడు ప్రకటనల కోసం వినియోగిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ అగంతకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఓ ఐటీ ఉద్యోగి రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల టెక్కీ డిజిటల్ అరెస్ట్ అయ్యారు. నవంబర్ 11న బాధితుడికి తాను ట్రాయ్ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన సిమ్ కార్డుతో అక్రమ ప్రకటనలు, మహిళల్ని వేదించేలా వారికి మెసేజ్‌లు పంపేందుకు ఉపయోగిస్తున్నారని, దీనిపై ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు చెప్పాడు. దీంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు.
మేం మీకు ఫోన్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచండి. కేసును ఆన్‌లైన్‌లో విచారిస్తాం. సహకరించండి. వర్చువల్‌గా విచారించేందుకు మీరు ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి అని కోరాడు. ఆ తర్వాత బాధితుడికి నకిలీ ముంబై పోలీసు యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఓ వ్యాపార వేత్త మీ ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి రూ.6 కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. దీనిపై కేసు నమోదైందని మరింత భయపెట్టించాడు.
అయితే, నవంబర్ 25న, పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి బాధితుడికి ఓ యాప్ నుంచి కాల్ చేశాడు. మీ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం, మీరు మా విచారణకు సహకరించాలి. లేదంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు.
ముందుగా వెరిఫికేషన్ నిమిత్తం చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించాడు. బాధితుడు అరెస్టుకు భయపడి నిందితులు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.11.8కోట్లను ట్రాన్స్ ఫర్ చేశాడు. అది సరిపోదని ఇంకా కావాలని డిమాండ్ చేయడం తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే తాను మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment