సాక్షి బెంగళూరు: అపత్కాలంలో నమ్మించిన వాళ్లే మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపడమే కాకుండా.. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్ రెండో లేఅవుట్‌లో రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన అనూప్‌కుమార్ (38), ఆయన భార్య రాఖీ (35) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల అనుప్రియా అనే కుమార్తె, రెండేళ్ల ప్రియాంక్ అనే కుమారుడున్నారు. అనూప్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమార్తె అనుప్రియాకు మానసికంగా సరిగా లేకపోవడంతో ఇంటి పనికోసం, తన పాపను చూసుకునేందుకు ఇద్దరు పనివారిని పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం పనివారు ఉదయాన్నే వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లి చూడగా వారి హత్యోదంతం బయటపడింది.
అనూప్ కుమార్‌కు ఉద్యోగం లేకపోవడంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయని ఉద్దేశ్యంతో తెలిసిన బంధువు ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టారు. బంధువులు మోసం చేశారు. పిల్లలకు చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక తనువు చాలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment