సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వేధింపులకు, ఆర్థిక మోసాలకు పాల్పడే ఫేక్ లోన్‌యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆన్‌లైన్ రుణ యాప్‌లు ప్రముఖ కంపెనీల పేర్లను సైతం వాడుకొని ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూపీ ప్రో అనే ఆన్‌లైన్ రుణ యాప్ బజాజ్ ఫైనాన్స్ పేరును వినియోగించినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గుర్తించింది.
ఫేక్ యాప్‌ల వివరాలను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడిస్తోంది. చైనా సహా శత్రుదేశాల నుంచి కొన్ని సంస్థలు ఆన్‌లైన్ రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటి సర్వర్లు ఆయా దేశాల్లో ఉంటున్నందున బాధితులు మోసపోయినప్పుడు కేసుల దర్యాప్తు సైతం కష్టసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో రుణం తీసుకొనే ముందు యాప్‌ల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
ఫేక్ రుణ యాప్‌ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
♦ వెరిఫై చేయని ఆన్‌లైన్ రుణ యాప్‌లనుప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవద్దు.
♦ ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో అఫిలియేషన్ లేకపోయినా అది మోసపూరిత ఆన్‌లైన్ లోన్ యాప్‌గా గుర్తించాలి.
♦ తక్కువ మంది యూజర్లు, ప్రతికూల రేటింగ్స్ ఉన్న యాప్‌ల జోలికి వెళ్లవద్దు.
♦ రుణం ఇచ్చేందుకు నిబంధనలేమీ లేకుండా వెంటనే సొమ్ము ఖాతాలో జమ చేస్తామని పేర్కొనే యాప్‌లు నకిలీవేనని తెలుసుకోవాలి.
♦ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలి.
కేంద్ర హోంశాఖ గుర్తించిన నకిలీ రుణ యాప్‌లు - ఐవొరి లెండ్స్, క్యాష్ పార్క్, ఆన్‌లైన్ రూపీ ప్రో, మొబాబా కాయిన్స్, ఫిన్‌కాష్, లోన్‌బడ్డీ.
Comments
Please login to add a commentAdd a comment