వినోద్‌జైన్‌ను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలోని విద్యాధరపురానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక బలవన్మరణానికి కారకుడైన కామాంధుడు వినోద్ జైన్ (48)ను భవానీపురం పోలీసులు ఆరెస్టుచేసి, మంగళవారం సాయంత్రం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సునీల్‌కుమార్ ముందు హాజరుపరిచారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరా దృశ్యాలను సీజ్‌చేసి కోర్టుకు సమర్పించారు. తొలుత.. ఐపీసీలోని 306, 354(ఏ), (డి) 509, 506 పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం.. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 354, 354డి, 509, 506 ఐపీసీ సెక్షన్లను చేర్చారు. దీంతో మేజిస్ట్రేట్ నిందితుడికి ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు.
అనంతరం వినోద్‌ను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికకు ఏమైనా మెసేజ్‌లు పంపించేవాడాç? వీడియోలు ఏమైనా తీశాడా? బాలిక ఆత్మహత్య లేఖ కాకుండా గతంలో ఇంకా ఎక్కడైనా రాసుకుందా, తదితర అంశాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను కూడా పోలీసులు విచారించారు. బాలిక బయటకు వెళ్లే సమయాల్లో వినోద్ జైన్ అక్కడే ఉండేవాడని అతను చెప్పాడు.
రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలివే..
► బాలికను లైంగికంగా వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి వినోద్ జైన్ కారకుడయ్యాడు.
► బాలిక ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఆత్మహత్యకు కారకుడయ్యాడు.
► బాలిక నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని జీ–43లో నిందితుడు ఉండేవాడు.
► జనవరి 29వ తేదీ సా.5.15 గంటలకు అపార్ట్‌మెంట్ పైనుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలలుగా వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్‌లో ఆమె స్పష్టంగా రాసింది.
► దీంతోపాటు ఆమె సెల్‌ఫోన్, ట్యాబ్‌లో ఆ వేధింపులను పొందుపరిచింది.
► లిఫ్ట్, మెట్ల వద్ద వెంటపడేవాడు. బాలిక తమ్ముడు విఘ్నేష్ (10)ను స్కూల్ ఆటో వద్దకు తీసుకెళ్లేటప్పుడు, సరుకుల కోసం షాపునకు వెళ్లేటప్పుడు, వాకింగ్‌కు వెళ్లేటప్పుడు వినోద్ అసభ్యంగా ప్రవర్తించేవాడు.
► ఈ బాధలను భరించలేక ఆమె అపార్టుమెంట్ పైనుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది.
బాలిక సూసైడ్ నోట్‌తోపాటు, సెల్‌ఫోన్, ట్యా బ్‌ను పోలీసులు సీజ్‌చేశారు. 12 మంది సాక్షులను విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment