అరారియా: అత్యాచార బాధితులకి న్యాయం జరగాలంటే కోర్టుల్లో ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే రోజులు ఇక ముందు ఉండవని ఆశ కలిగేలా బిహార్ కోర్టు మెరుపువేగంతో తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ఒక వ్యక్తికి పోక్సో కోర్టు కేవలం ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బిహార్‌లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దోషికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు.
బాధితురాలి భవిష్య™Œ కోసం పరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్ 4నే కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పు పూర్తి పాఠం ఈనెల 26న అందుబాటులోకి వచ్చింది. జూలై 22న ఈ అత్యాచార ఘటన జరగ్గా, ఆ మర్నాడు ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అరారియా మహిళా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ రీటా కుమారి ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రేప్ కేసుల్లో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసిన కేసు ఇదేనని పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామల యాదవ్ తెలిపారు. 2018 ఆగస్ట్‌లో మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా కోర్టు ఒక అత్యాచారం కేసులో మూడు రోజుల్లో తీర్పు ఇచ్చి రికార్డుకెక్కిందని ఇప్పుడు బిహార్ కోర్టు దానిని తిరగరాసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment