
తిరువొత్తియూరు: చెన్నై ఆవడిలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నై ఆవడి గోవర్ధనగిరి నగర్‌కు చెందిన ఉదయ (24) ఎంబీఏ పూర్తి చేసి పూందమల్లి సమీపం కాట్టుపాక్కంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతను అదే కంపెనీలో పని చేస్తున్న పూందమల్లి కుమరన్ నగర్‌కు చెందిన బీఏ గ్రాడ్యుయేట్ అనిత (26)ను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు.
విషయం తెలిసి అనిత తల్లిదండ్రులు కుమార్తెకు మరో యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో అనిత ఈనెల 6వ తేదీన చెన్నై రాయపురంలో ఉన్న రిజిస్టర్ కార్యాలయంలో ఉదయను ప్రేమ వివాహం చేసుకుంది. వధూవరులు గోవర్ధనగిరి నగర్లోని ఉదయ ఇంటి మిద్దెపై ఉంటున్నారు. ఈ క్రమంలో అనిత శుక్రవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దీనిపై సమాచారం అందుకున్న ఆవడి పోలీసులు అక్కడికి చేరుకుని అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చెన్నై కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆవడి పోలీసులు, తిరువళ్లూరు ఆర్‌డీవో విచారణ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.