
త్రిపురాంతకం: స్థల వివాదంతో తోడబుట్టిన తమ్ముడిని అన్న కారుతో ఢీకొట్టి ప్రాణం తీశాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లికి చెందిన కంచర్ల ఏడుకొండలు(30), అతని అన్న వెంకటేశ్వర్లుకు మధ్య ఐదు సెంట్ల స్థలం విషయంలో వివాదం నెలకొంది. తరచూ దాని గురించి తగాదాలు పడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు.
మంగళవారం రాత్రి కూడా స్థలం విషయమై ఘర్షణ పడ్డారు. గొడవ జరిగాక ఏడుకొండలు నేషనల్ హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెంకటేశ్వర్లు కారుతో ఢీకొట్టాడు. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి మూడేళ్ల కుమార్తె ఉండగా.. గర్భిణి అయిన భార్య యల్లమ్మ కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. తల్లి రమణమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment