సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ కమిషనరేట్‌లో ఉన్నతాధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో హైదరాబాద్ జీఎస్టీ కమిషరేట్ పన్ను ఎగ వేత నిరోధక విభాగం డిప్యూటీ కమిషనర్ చిలుక సుధారాణి, సూపరిం టెండెంట్ బొల్లినేని శ్రీనివాసగాంధీ, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్‌రెడ్డిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తవ్వుతున్న క్రమంలోనే బొల్లినేనిపై తాజా కేసు నమోదైందని సమాచారం.
అసలేం జరిగిందంటే.?: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ పన్ను ఎగవేత విభాగంలోని అధికారులు లంచం తీసుకున్నట్లుగా గతేడాది అక్టోబర్ 31న సీబీఐకి సమాచారంఅందింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే దీనిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్– దాని అనుబంధ సంస్థలు అక్రమంగా ఇన్ పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) పొందాయన్న కేసును చిలుక సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీ బృందం దర్యాప్తు చేసింది. కేసును నిందితులకు అనుకూలంగా మార్చేందుకు వీరు, మరికొందరు జీఎస్టీ అధికారులతో కలిసి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 2019, ఏప్రిల్ 15న రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. మిగిలిన మొత్తానికి భూములను కొనివ్వాలన్న ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై సీబీఐకిగానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ఫిర్యాదు చేయనందుకుగాను సత్య శ్రీధర్‌రెడ్డి పేరును కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. కాగా, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన శ్రీనివాసగాంధీపై గతేడాది ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే.
అక్రమాస్తులు, మనీ ల్యాండరింగ్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో (ఈడీ) పనిచేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటి వారిపై విరుచుకుపడినట్లు ఆరోపణలున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే సీబీఐ గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. గత ఏడాది జూలై 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.200 కోట్ల విలువచేసే అక్రమాస్తుల్ని గుర్తించింది. ఈ కేసు ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ శ్రీనివాసగాంధీపై అదే నెల 23న ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేసింది. ఆయన భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది. సీబీఐ నమోదు చేసిన కేసు, చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్ చేయడం, అనుకూలంగా వ్యవహరించమన్న వారిని విడిచిపెట్టడం చేస్తూ భారీగా ఆర్జించినట్లు గాంధీపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు.. 2019, జూన్ 26 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే.
చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు...
చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధి కారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా చంద్రబాబు పైరవీల ఫలితంగా ఆయన్ను బషీర్‌బాగ్ జీఎస్టీ భవన్‌లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్ ఆఫీ సర్‌గా నియమించారు. ఆ విభాగం కేంద్రం గా చేసిన అవినీతిపై తాజాగా సీబీఐ మరో కేసు నమోదు చేసింది. గతంలో ఎవరూ పని చేయని విధంగా బొల్లినేని గాంధీ ఈడీలో సుదీర్ఘకాలం పని చేశారు. 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ.. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆయన ఏడాది పాటు పనిచేశారు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 వరకు ఎలాంటి బది లీలు లేకుండా ఈడీలోనే విధులు నిర్వర్తించారు. ఇలాంటి పోస్టుల్లో పని చేసి వచ్చిన వారికి జీఎస్టీలో ఫోకల్ పోస్టు ఇవ్వరు. అయితే దీనికి భిన్నంగా అందులోనూ గాంధీకి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసును సైతం పర్యవేక్షించిన గాంధీ ఆయనకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారని, దీనికి బదులుగా భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ సుజనా చౌదరి అరెస్టు కాలేదని తెలుస్తోంది.
ఇరు రాష్ట్రాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు...
గడిచిన పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న శ్రీనివాస గాంధీ ఆయన కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు కట్టారు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో, స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గత ఏడాది నమోదు చేసిన తన ఈసీఐఆర్‌లో ఆరోపించింది. త్వరలో ఈ కేసుకు సంబంధించి గాంధీ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీనివాసగాంధీపై సీబీఐ రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో బొల్లినేనితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment