సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. చంద్రబాబు రెండు రోజుల పోలీసు కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసు కస్టడీ ముగియడంతో జైలు అధికారులు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంది. విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? కఠినంగా ఏమైనా వ్యవహరించారా? అని ఆరా తీసింది. అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు కోర్టుకు నివేదించారు.
విచారణ సందర్భంగా ఆహారం, మందులతోపాటు న్యాయవాదులతో మాట్లాడుకునే వెసులుబాటు తదితర అవకాశాలిస్తూ ఆదేశాలిచ్చామని, వాటిని ఏమైనా అధికారులు ఉల్లంఘించారా? అని న్యాయస్థానం ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. భౌతికంగా ఇబ్బందులకు గురి చేశారా? అని కోర్టు ప్రశ్నించగా, లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇంకేమైనా చెప్పాల్సి ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించడంతో, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, అక్రమంగా జైలులో ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు.
మీ పాత్రపై 600కిపైగా డాక్యుమెంట్లు...
మీపై ప్రస్తుతం ఉన్నవి ఆరోపణలేనని కోర్టు చంద్రబాబుకు తెలిపింది. సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో మీ పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచిందని పేర్కొంది. సీఐడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించి వాటికి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు వచ్చిన తరువాతే జుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది.
సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాతనే మీరు దోషినా? నిర్ధోషినా? అన్నది కోర్టు తేలుస్తుందని చంద్రబాబుకు స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించే ఈ కోర్టు ముందుకెళుతుందని తెలిపింది. సీఐడీ అధికారులు ఈ కేసులో మీ పాత్రకు సంబంధించి 600కిపైగా డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారని తెలిపింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అవన్నీ ఈ దశలో రహస్య డాక్యుమెంట్లే అవుతాయని చంద్రబాబుకు స్పష్టం చేసింది.
దర్యాప్తు జరగాల్సిందే.. అది ప్రొసీజర్
దర్యాప్తు అధికారులకు విశిష్ట అధికారాలుంటాయని కోర్టు పేర్కొంది. అయితే మీ హక్కులను, దర్యాప్తు సంస్థ విశిష్టాధికారాన్ని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని, ఇప్పుడు తాము అదే చేస్తున్నామని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, సీఐడీ ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వలేదని చంద్రబాబు పేర్కొనగా, మీకు ఇవ్వదగ్గ డాక్యుమెంట్లు కొన్ని ఉంటాయని, వాటిని మీ న్యాయవాదుల ద్వారా తీసుకోవచ్చని సూచించింది.
వాటిని పరిశీలిస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారన్న సంగతి మీకు అర్థం కావచ్చని చంద్రబాబునుద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు జరగాల్సిందేనని, అది ప్రొసీజర్ అని కోర్టు గుర్తు చేసింది. మీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, దానిపై విచారణ జరపాల్సి ఉందని కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే బెయిల్ ఇవ్వాలా?వద్దా? అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. అందుకోసమే జుడీషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మీరు ప్రస్తుతం పోలీసు కస్టడీలో లేరని, కోర్టు కస్టడీలో ఉన్నారని పేర్కొంటూ చంద్రబాబును జాగ్రత్తగా చూసుకోవాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
యాంత్రికంగా ఉత్తర్వులిస్తున్నామా?
అంతకు ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో చిన్నపాటి హైడ్రామా నడిపారు. జుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు. కోర్టు తనంతట తానుగా రిమాండ్‌ను పొడిగించలేదన్నారు. రిమాండ్‌ను పొడిగించవద్దని కోరారు. పొడిగింపు కోసం సీఐడీ మెమో దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగింపు పిటిషన్ వేయలేదా? అని ఏసీబీ కోర్టు ప్రశ్నించడంతో తాము రిమాండ్ పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదించారు. ఆ కాపీని చంద్రబాబు న్యాయవాదులకు అందచేయాలని పీపీని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం పోసాని స్పందిస్తూ కోర్టు యాంత్రికంగా జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొనడంపై న్యాయస్థానం ఒకింత తీవ్రంగా స్పందించింది.
సీఐడీ తమ ముందుంచిన కేసు డైరీని, సెక్షన్ 164 స్టేట్‌మెంట్లన్నింటినీ చదివామని, అలాగే 2000 పేజీలపైగా డాక్యుమెంట్లను పరిశీలించామని, వాటన్నింటినీ చూసిన తరువాతనే చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు రావడం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలకు అనుగుణంగానే జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తేల్చి చెప్పింది.
అంతేకానీ మీరు చెబుతున్నట్లు యాంత్రికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. కోర్టు ఆగ్రహంతో ఖంగుతిన్న చంద్రబాబు న్యాయవాది తమ ఉద్దేశం అది కాదంటూ సమర్థించుకునే యత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం న్యాయస్థానం ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
మాకు సమయం ఎక్కడిస్తున్నారు..?
అటు తరువాత ఏసీబీ కోర్టు ఇరుపక్షాలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కోర్టు ఏదీ యాంత్రికంగా చేయడం లేదని పేర్కొంది. ప్రతి చిన్న విషయానికి పలు పిటిషన్లు వేస్తున్నారని, ఒకదాని వెంట మరొకటి పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేసింది. ‘మీరు వేసిన దానికి వారు, వారు వేసిన దానికి మీరు కౌంటర్లు వేస్తారు.
వాటిన్నింటినీ ఈ కోర్టు క్షుణ్ణంగా చదవాలి. అర్థం చేసుకోవాలి. చట్టం ఏం చెబుతుందో చూడాలి. కోర్టు ఇన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసేందుకు మీరు కోర్టుకు సమయం ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు పిటిషన్ వేశాం, వినాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందరూ కోర్టుకు సహకరిస్తేనే పనిచేయడం సాధ్యం అవుతుంది. చట్టానికి లోబడే వ్యవహరించాలి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని న్యాయస్థానం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment