
తల్లిదండ్రులు జగన్నాథం, చింతల్లితో చిన్నారి కుసుమ (ఫైల్)
మాడుగుల (విశాఖ): పండగకు అత్తవారింటికి ఎంతో సంతోషంతో బయలుదేరిన ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదం నింపింది. కారు రూపంలో మృత్యువు చిన్నారిని కబళించింది. గ్రామస్తుల కథనం మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలో డి. సురవరం గ్రామానికి చెందిన మువ్వల జగన్నాథం భార్య చింతల్లి, కుమార్తెలు కుసుమ(5), సిరి(3)తో కలిసి పండగ నిమిత్తం శుక్రవారం సాయంత్రం రావికమతం మండలం బలుసుపాలెంలోని అత్తవారింటికి బైక్‌పై బయలుదేరాడు. గ్రామం దాటుతుండగానే చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో పెద్ద కుమార్తె కుసుమ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
జగన్నాథం, భార్య చింతల్లి, చిన్న కుమార్తె సిరికి కాళ్లు, తలపై బలమైన గాయాలయ్యాయి. కారు రోడ్డుపక్కన పల్లపు ప్రాంతంలోకి దూసుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వచ్చిన 108 వాహనంలో వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. జగన్నాథం పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. చింతల్లి, సిరి మాడుగుల ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. కుసుమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించామని ఎస్‌ఐ రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment