దాడులు చేసుకుంటున్న బీఆర్‌ఎస్,బీజేపీ కార్యకర్తలు
హన్మకొండ: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో బీజేపీ కార్యకర్తలతోపాటు, పోలీసులకు గాయాలయ్యాయి. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గురువారం హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిది. దీంతో పోలీసులు క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్లు ముళ్ల కంచెతో మూసివేశారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి నేతృత్వంలో పార్టీనేతలు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అయితే అప్పటికే బీఆర్‌ఎస్ కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముళ్లకంచె వరకు చేరుకుని నినాదాలు చేస్తుండగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు కర్రలతో దాడికి దిగడంతో, బీజేపీ కార్యకర్తలు ఆ కర్రలను లాక్కొని ప్రతి దాడికి దిగారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పూనుకోగా బీజేపీ కార్యకర్తలు సైతం రాళ్లతో దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఆరెస్టు చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకి గాయాలు
అంతకు ముందు హనుమకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ క్యాంపు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీఫ్‌విప్ క్యాంపు కార్యాలయ ముట్టడికి వస్తున్న పద్మను పోలీసులు అడ్డుకున్న క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు పద్మను జుట్టు పట్టి లాగడంతో మెడకు, చేతికి గాయమైంది. అనంతరం పద్మతో పాటు నాయకులు, కార్యకర్తలను ధర్మాసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment