
నక్కపల్లి: మండలంలో నీలకుండీల నర్సాపురంలో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పదంగా మరణించిన గుబ్బల నాగమణిది హత్యేనని సీఐ నారాయణరావు, ఎస్‌ఐ డి.వెంకన్నలు తెలిపారు. బుధవారం వారు నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించాడు. కోటవురట్ల మండలం రామచంద్రపాలెంకు చెందిన గుబ్బల నాగమణి, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన లక్ష్మణరావులు నర్సాపురంలో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు గ్రామంలో ఒక భూస్వామికి చెందిన తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవిస్తున్నారు. అంతేకాకుండా వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి వచ్చి, నాగమణిని వేధిస్తుండేవాడు.
గత నెల31న కూలిపనికి వెళ్లి వెయ్యి రూపాయలు సంపాదించాడు. ఒకటో తేదీన నాగమణి కూలి డబ్బుల విషయమై ఆరా తీసింది. అతను సరైన సమాధానం చెప్పక పోగా మద్యం సేవించి వచ్చి ఆమెను హింసించాడు. తన వ్యసనాలకు అడ్డంకిగా మారిందని ఎలాగైనా ఆమె అడ్డుతొలగించుకోవాలని భావించాడు. పీక నులిమి, నోటిలో గుడ్డలు కుక్కి నాగమణిని హత్యచేశాడు. నాగమణి చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విచారణలో నాగమణిని హత్య చేసింది లక్ష్మణరావేనని తేలిందని, అతను నేరాన్ని అంగీకరించాడని సీఐ, ఎస్‌ఐలు తెలిపారు. లక్ష్మణరావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు చెప్పారు.
చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం