
టీ.నగర్: బిడ్డను హతమార్చి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సేలం జిల్లాలో జరిగింది. అన్నదానపట్టి మూనాంగాడు ప్రాంతానికి చెందిన గోపీనాథ్ (31), పవిత్ర (29) దంపతులకు కుమార్తె నందిత (5) ఉంది. గోపినాథ్ మిఠాయి దుకాణంలో, పవిత్ర బనియన్ కంపెనీలో పనిచేసేవారు. ఇలావుండగా గోపినాథ్‌కు వారం రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. దీంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ వచ్చాడు.
శనివారం సాయంత్రం అతని తల్లి సెంగమళం కుమారుని చూసేందుకు ఇంటికి వచ్చింది. తలుపులు తట్టినా తెరవకపోవడంతో అనుమానించిన ఆమె ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వారు వెనుక తలుపులు పగులగొట్టుకుని లోపలికి వెళ్లి చూడగా గోపీనాథ్, పవిత్ర ఒకే చీరకు ఉరేసుకుని నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు.
బిడ్డ నందిత నేలపై శవంగా కనిపించింది. సమాచారం అందుకున్న అన్నదానపట్టి పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. బిడ్డకు క్రిమి సంహారక మందు ఇచ్చి హతమార్చి దంపతులు ఇరువురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కరోనా వైరస్‌తో తీవ్ర మనస్తాపానికి గురైన గోపీనాథ్ తన భార్య, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
చదవండి: టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment